Viral News: జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి మూడేళ్లు అదనంగా జైలు జీవితం గడిపేలా చేసింది. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని జైలు అధికారుల అధికారిక మెయిల్ కు పంపించింది. అయితే ఈ-మెయిల్ ను అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో అతడు మూడేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. గుజరాత్ జైలు అధికారుల నిర్లక్ష్యపూరిత వైఖరిపై  ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి రూ. లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


27 ఏళ్ల చందన్‌జీ ఠాకోర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో గుజరాత్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి సెప్టెంబర్ 29, 2020 న హైకోర్టు శిక్షను నిలిపి వేస్తూ బెయిల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఆర్డరు కాపీని ఈ-మెయిల్ లో పంపించింది. కానీ, దానిని అధికారులు ఓపెన్ చేయలేదు. దాంతో ఇప్పటి వరకు 2023 వరకు చందన్‌జీ ఠాకోర్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా అతడు మరోసారి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేయడంతో జైలు అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


బెయిల్ ఆర్డరు కాపీలు కోర్టు రిజిస్ట్రీ నుంచి జైలు అధికారులకు చేరాయి. కానీ వారు ఆ మెయిల్ లోని అటాచ్ మెంట్‌ను మాత్రం ఓపెన్ చేయలేదు. అంతేకాకుండా ఆ ఈ-మెయిల్ ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపించినప్పటికీ.. అక్కడ కూడా సరైన పర్యవేక్షణ కనిపించలేదు. దోషి అదనంగా మూడేళ్ల జైలు శిక్ష అనుభవించడానికి కారణమైన జైలు అధికారులపై గుజరాత్ హైకోర్టు సీరియస్ అయింది. అతడికి రూ. లక్షల పరిహారం చెల్లించాలంది. ఆ మొత్తాన్ని 14 రోజుల వ్యవధిలో చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా కొవిడ్ సమయంలో ఇలా మెయిల్ లో ఇచ్చిన ఆదేశాలన్నీ అమలు అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది.