Maneka Gandhi on ISKCON:
మనేకా గాంధీ ఆరోపణలు..
బీజేపీ ఎంపీ మనేకా గాంధీ ఇస్కాన్ (ISKCON)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థ ప్రజల్ని మోసం చేస్తోందని, గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేశాయి ఈ కామెంట్స్. ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సంపాదిస్తోందని, భూములనూ కొల్లగొడుతోందని ఆరోపించారు మనేకా గాంధీ.
"ఇస్కాన్ సంస్థ దేశ ప్రజల్ని మోసం చేస్తోంది. గోశాలలను ఏర్పాటు చేస్తోంది. వాటి నుంచి బాగా సంపాదిస్తోంది. ప్రభుత్వం నుంచీ పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటోంది. భూమలనూ సంపాదించుకుంటోంది. ఆ తరవాత ఆ గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోంది. ఈ మధ్యే ఏపీలోని అనంతపూర్ గోశాలకు వెళ్లాను. అక్కడ ఒక్క ఆవు కూడా ఆరోగ్యంగా లేదు. ఒక్క దూడ కూడా కనిపించలేదు. అంటే ఆవులను కసాయి వాళ్లకు అమ్ముతున్నారనేగా అర్థం. ఇస్కాన్ అమ్మినంతగా దేశంలో మరెవరూ ఆవుల్ని ఇలా అమ్ముకోరు. కానీ మళ్లీ వాళ్లే రోడ్లపైకి వచ్చి హరేరామ హరేకృష్ణ అని భజనలు చేస్తారు"
- మనేకా గాంధీ, బీజేపీ ఎంపీ
తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..
మనేకా గాంధీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఇస్కాన్ స్పందించింది. ఇదంతా అసత్య ప్రచారం అని కొట్టి పారేసింది. ఆవులు, ఎద్దుల్ని కాపాడే విషయంలో ఇస్కాన్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. దేశంలోనే కాకుండా...విదేశాల్లోనూ ఆవులను సంరక్షిస్తున్నట్టు వివరించింది.
"మనేకా గాంధీ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆవులు, ఎద్దుల్ని రక్షించడంలో ఇస్కాన్ ముందుంటుంది. కేవలం దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆవులు, ఎద్దులు బతికున్నంత కాలం సేవ చేస్తాం. మనేకా గాంధీ ఆరోపిస్తున్నట్టుగా వాటిని కసాయి వాళ్లకి అమ్మడం లేదు"
- యుదిష్టిర్ గోవింద, ఇస్కాన్ జాతీయ ప్రతినిధి