రాజమహేంద్రవరంలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన తన భర్త చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ ఆమె ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె దేవాలయాలు సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇటీవలే అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని అక్కడ భువనేశ్వరి పూజలు చేశారు. తాజాగా నేడు (సెప్టెంబరు 27) భువనేశ్వరి రాజమహేంద్రవరంలోని లూథరన్ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన భర్త చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని దేవుణ్ని వేడుకున్నారు. భువనేశ్వరి వెంట లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి కూడా ఉన్నారు.
అలాగే తమ కుటుంబంతోపాటు రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకున్నట్లుగా ఆమె తెలిపారు. అనంతరం నారా భువనేశ్వరి అక్కడ నుంచి రాజానగరం నియోజకవర్గం సీతానగరం బయలుదేరి వెళ్లారు. సీతానగరంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. భువనేశ్వరి సీతానగరం దీక్షా శిబిరానికి చేరుకొని సందర్శించి మాట్లాడనున్నారు.