Madhya Pradesh Election:
కైలాశ్ విజయ్ వర్గియ కామెంట్స్..
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఇక్కడ ఎలక్షన్స్ జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం మొదలు పెట్టాయి. షెడ్యూల్ ఖరారు కాకపోయినా ముందస్తుగానే ప్రచారం మొదలు పెట్టాయి. అభ్యర్థుల జాబితాలనూ సిద్ధం చేసుకున్నాయి రెండు పార్టీలు. అనుకున్నట్టుగానే కొంత మందికి టికెట్‌లు దక్కాయి. మరికొందరిని ఇరు పార్టీల అధిష్ఠానాలు పక్కన పెట్టాయి. వాళ్లంతా అసంతృప్తితో ఉంటే...ఓ లీడర్ మాత్రం తనకు టికెట్ ఇచ్చినందుకు బాధ పడుతున్నారు. ఆయనే బీజేపీ సీనియర్ నేత, నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గియ (Kailash Vijayvargiya). తనకు వద్దని చెప్పినా పిలిచి మరీ హైకమాండ్ టికెట్ ఇచ్చిందని ఓ సభలో వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి కనీసం 1% కూడా తనకు లేదని, అయినా అధిష్ఠానం తనకు పోటీ చేసే అవకాశమిచ్చిందని అన్నారు. ఇంత సీనియర్ నేతను ఓటర్ల దగ్గరికి వెళ్లి ఓటు వేయండి అంటూ అడుక్కోవాలా అంటూ ప్రశ్నించారు.
"నాకు టికెట్ ఇచ్చినందుకు ఏ మాత్రం సంతోషంగా లేను. నేను నిజమే చెబుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఏ మాత్రం లేదు. కనీసం 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. అయినా నేనో సీనియర్ లీడర్‌ని. ఈ వయసులో నేను ఓటర్ల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని ఓటు వేయండి అని అడగాలా..? నాకు కేవలం స్పీచ్‌లు ఇచ్చి వెళ్లిపోవడమే ఇష్టం. అదే నా ప్లాన్ కూడా"
- కైలాశ్ విజయ్‌వర్గియ, బీజేపీ సీనియర్ నేత
అప్పుడేమో వేరే విధంగా..
ఇండోర్-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు కైలాశ్. అంతకు ముంద ఇండోర్ మేయర్‌గా పని చేశారు. కేబినెట్ మంత్రిగానూ పని చేసిన అనుభవముంది. బీజేపీలో సీనియర్ పదవిలోనూ ఉన్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కైలాశ్ మరో విధంగా మాట్లాడారు. హైకమాండ్ తనకు టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఓటర్ల ఆకాంక్షలకు తగ్గట్టుగా పని చేస్తానని చెప్పారు. కానీ...ఇప్పుడు మాత్రం ఇష్టంలేకున్నా టికెట్ ఇచ్చారని అనడమే అంతుపట్టకుండా ఉంది. హైకమాండ్ టికెట్ ఇచ్చిందని ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని అన్నారు.
"8 పబ్లిక్ మీటింగ్స్ హాజరవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. 5 మీటింగ్‌లకు హెలికాప్టర్‌లలో వెళ్లాలని, 3 మీటింగ్స్‌కి కార్‌లో వెళ్లాలని అనుకున్నాను. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదుగా. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమొచ్చింది. నాకిప్పటికీ నమ్మకం కుదరడం లేదు టికెట్ వచ్చిందంటే"
- కైలాశ్ విజయ్‌వర్గియ, బీజేపీ సీనియర్ నేత