కుర్చీ ఉంటే కానీ ఆమె పింఛన్ తీసుకోలేదు. అవును నిజమే... నాలుగు కాళ్ల కుర్చీతో కాళ్లీడ్చుకొని బ్యాంకు వరకు వెళ్లి పింఛన్ తీసుకున్న ఓ వృద్ధురాలి దీన గాథ ఇది. 


ఒడిశాలోని ఝరిగావ్‌లో వెలుగు చూసిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏకంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పందించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. 


ఒడిశాలోని ఝరిగావ్‌ సమీపంలో ఓ పల్లెలో నివాసం ఉంటున్న సూర్యహరిజన్ తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ తీసుకోవాడానికి అష్టకష్టాలు పడుతోంది. ఆమె వెలి ముద్రలు పని చేయడం లేదు. ఫేస్‌ రికగ్నేషన్ కూడా పని చేయడం లేదు. అందుకే బ్యాంకుకు వెళ్లి తన పించన్ తీసుకోవాల్సి వస్తోంది. 


ప్రతి నెల తన పింఛన్ కోసం కిలోమీటర్లు ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. నడవడానికి వయసు సహకరించకపోవడంతో విరిగిపోయిన ఓ కుర్చీని దన్నుగా పెట్టుకొని కాళ్లు ఈడ్చుకొని వెళ్తున్నారు. 






వృద్ధురాలిని అలా బ్యాంకుకు రప్పించడంపై స్పందించిన ఝరిగావ్‌ ఎస్బీఐ మేనేజర్‌... ఆమె చేతి వేళ్లు విరిగిపోయి ఉన్నాయని... అందుకే డబ్బులు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చెప్పారు. త్వరలోనే దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తామన్నారు. 
కాళ్లకు కనీసం చెప్పులైనా లేవు. మండుటెండలో వెళ్తున్న ఆమె దుస్థితిని చూసి నెటిజన్లు చలించిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రియాక్ట్ అయ్యారు. 


ఇలాంటి సందర్భాల్లో కాస్త మానవత్వంతో స్పందించాలే కానీ ఇలాంటి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎస్‌బీఐను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోమని సూచించారు. అక్కడ బ్యాంక్ మిత్ర లేరా అని ప్రశ్నించారు. 






అయితే ఆమె పింఛన్ మనీ కోసం వెళ్లడం లేదని... కుమార్తె ఇంటికి వెళ్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అంటున్నారు. 


ఎస్బీఐ స్పందన


ఈ వీడియోపై ఎస్‌బీఐ కూడా రియాక్ట్ అయింది. ఆ వీడియో చూసి తాము కూడా చాలా బాధపడ్డామంది. సూర్య హరిజన్ ఎప్పుడూ తన గ్రామంలోనే ప్రతి నెలా పింఛను తీసుకునేవారు. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు CSP పాయింట్‌లో సరిపోలడం లేదు. ఆమె తన బంధువులతో కలిసి మా ఝరిగావ్ బ్రాంచ్‌ని సందర్శించారు. ఆ బ్రాంచ్ మేనేజర్ వెంటనే ఆమె ఖాతాలోని డబ్బులను చెల్లించారు. వచ్చే నెల నుంచి పింఛను ఆమె ఇంటి వద్దకే వచ్చి అందజేస్తామని చెప్పారు. సూర్య హరిజన్‌కి ఓ వీల్‌చైర్‌ను  కూడా అందజేయాలని కూడా నిర్ణయించుకున్నాము. అని ట్విట్టర్ ద్వార తెలిపింది.