Uttarkashi Tunnel Collapse Updates: ఉత్తరాఖండ్ (Uttarakhand) ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel)లో చిక్కుకున్న కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ (Tunnel Rescue Operation)లో అధికారులు కీలక అడుగు వేశారు.  సొరంగంలో చిక్కుకుని 10 రోజులుగా అందులోనే నరకయాతన పడుతున్న వారి ఫొటోలను అధికారులు తీయగలిగారు. కార్మికులకు ఆహార పదార్థాలను పంపేందుకు ఏర్పాటు చేసిన ఆరు అంగుళాల పైపు ద్వారా గత రాత్రి ఎండోస్కోపీ కెమెరా (Endoscopy Camera)ను సొరంగం లోపలికి పంపారు. అనంతరం కొంతమంది కార్మికులతో రెస్క్యూ అధికారులు వాకీ టాకీ (Walkie Talkie)లతో మాట్లాడారు. వారిని కెమెరా ముందుకు రావాలని కోరారు. 


కార్మికులతో మాట్లాడిన వీడియోను అధికారులు మీడియాతో పంచుకున్నారు. వీడియోలో కార్మికులు అందరు సురక్షితంగా ఉండడం కనిపించింది. ‘కెమెరా ముందుకి వచ్చి వాకీ టాకీ ద్వారా మాతో మాట్లాడండి’ అంటూ కార్మికులను ఓ అధికారి అడగడం వినిపించింది. టన్నెల్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్న కార్మికులకు అధికారులు ధైర్యం చెప్పారు. కార్మికులందరూ క్షేమంగా ఉన్నారని, ఓపెనింగ్‌లోకి డ్రిల్ చేసిన స్టీల్ పైపుల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


గత పది రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ విఫలం అవుతోంది. దట్టంగా పడిపోయిన పెద్ద పెద్ద రాళ్లు, సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. కార్మికులను రక్షించడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. వారి గురించి తెలుసుకోవడానికి అధికారులు ఎండో స్కోపీ కెమెరాను పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. కార్మికులకు పైపుల ద్వారా మొబైల్‌లు, ఛార్జర్‌లను కూడా పంపిస్తామని చెప్పారు. 


కార్మికులకు కిచిడీ, దాల్ 
గత పది రోజులుగా టెన్నెల్ చిక్కుకుని నరకయాతన పడుతున్న కార్మికులకు అధికారులు తొలి సారిగా వేడి వేడి ఆహారాన్ని పంపించారు. కార్మికుల వద్దకు ఏర్పాటు చేసిన ఆరు అంగుళాల పైపు ద్వారా కిచిడీ, దాల్ పంపించారు. కూలీలకు వేడి వేడి భోజనం పంపడం ఇదే తొలిసారి అని,  వైద్యులు సిఫార్సు చేసిన ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేస్తున్నట్లు  వంట మనిషి హేమంత్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. ఆరు అంగుళాల పైప్ ద్వారా కార్మికులకు ఆహారం, మొబైల్‌లు మరియు ఛార్జర్‌లను పంపగలమన్నారు. 


చిక్కుకుపోయిన కూలీల ఆరోగ్య పరిస్థితిని బట్టి, వారికి పంపే ఆహార పదార్థాల జాబితాను వైద్యుల సహకారంతో సిద్ధం చేసినట్లు చెప్పారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, దాలియా వంటి వాటిని పంపేందుకు వీలుగా వెడల్పాటి ప్లాస్టిక్  బాటిళ్లను తెప్పిస్తున్నట్లు కల్నల్ దీపక్ పాటిల్ చెప్పారు. అంతకుముందు రోజునేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అన్షు మనీష్ ఖుల్కో సహాయక చర్యలపై మాట్లాడారు. మొదటి లైఫ్‌లైన్‌నుకు అంతరాయం జరిగితే ఏం జరుగుతుందనే ఆందోళన ఉండేదని, ఇప్పుడు రెండో లైఫ్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతో భయం లేదన్నారు.


 కార్మికులను రక్షించడానికి సరికొత్త శక్తితో పనులు మొదలు పెడతామన్నారు. రెండో లైఫ్ లైన్ ఏర్పాటుతో కార్మికుల్లో ఆందోళన తగ్గిందని, వారిలో ఆనందం నెలకొందని చెప్పారు. అంతకు ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రెండు రోబోటిక్స్ యంత్రాలు ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని చూసినా ఫలితం లేకపపోయింది. సొరంగం లోపల పొరలు, రాళ్లు వదులుగా ఉన్నాయని, రోబోటిక్ ఆపరేషన్ విజయవంతం కాలేదని అన్నారు.