Silkyara Tunnel Latest News: దాదాపు 17 రోజుల శ్రమ, కృషి ఫలించింది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం (Silkyara Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను అధికారులు మంగళవారం సురక్షితంగా కాపాడారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో కార్మికులను రక్షించేందుకు చేసిన పలు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయినా అలుపెరుగని ప్రయత్నం చేసిన ప్రభుత్వం మంగళవారం వారిని బయటకు తీసుకొచ్చింది. రాట్ హోల్ మైనింగ్ నిపుణులు రాత్రి 7 గంటలకు శిథిలాలను పూర్తిగా తొలగించడంతో కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అస్సాం (SDRF) బృందం స్టీల్ పైప్ ద్వారా ఒక్కొక్కరిని స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు. ర్యాట్-హోల్-మైనింగ్ టెక్నిక్‌లో నిపుణుల బృందం సాయంతో రాత్రి 8 గంటల సమయమంలో తొలి కార్మికుడు సొరంగం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతన్ని ఒక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సొరంగం నుంచి బయటపడిన కార్మికుల్లో కొందరి మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మరికొందరు మొహాల్లో కృతజ్ఞత, ఇంకొందరిలో అలసిపోయిన భావాలు కనిపించాయి.
సొరంగం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నప్పుడు వారిని ఉత్సాహ పరిచేలా అక్కడ ఉన్నవారు నినాదాలు చేశారు. బయటకు వచ్చిన వారిని చూసి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కార్మికులను ఆస్పత్రులకు తరలిస్తున్నప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. తమ వారు సురక్షితంగా బయటపడడంతో కార్మికుల కుటుంబాలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రెస్క్యూ వార్త వెలువడడంతో చాలా మంది టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోయారని చెప్పారు.
ఏం జరిగిందంటే?
సిల్క్యారా టన్నెల్‌లో ఓ భాగం నవంబర్ 12న కుప్పకూలింది. అక్కడ పని చేస్తున్న 41 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేపట్టింది. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించాలని చూసింది. అయితే అక్కడ ఉన్న భారీ రాళ్లు, కాంక్రీట్, కారణంగా యంత్రాల బ్లేడ్లు విరిగిపోయాయి. దాదాపు 15 రోజుల పాటు చేసిన ప్రతి ప్రయత్నం విఫలం అవుతూ వచ్చింది. చివరకు రాట్ మైనింగ్ బృందం కార్మికులను రక్షించేందుకు రంగంలోకి దిగింది.
దానితో పాటుగా సొరంగంపై నుంచి కార్మికులను రక్షించేందుకు నిలువుగా ప్రత్నామ్నాయంగా 86 మీటర్లు డ్రిల్లింగ్ చేయాలని భావించారు. మంగళవారం ఆ పనులు కూడా 45 మీటర్ల మేర పూర్తయ్యాయి. రాట్ హోల్ మైనింగ్ నిపుణులు కూడా బృందాలుగా విడిపోయి స్టీల్ పైపులో ఇమిడిపోయే సాధనాలను ఉపయోగించి పరిమిత స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి కార్మికులు బయటకు రావడంలో కీలకంగా వ్యవహరించారు.
సొరంగం నుంచి బయటపడిన కార్మికులకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత అంబులెన్సుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రత్యేకంగా 41 పడకలతో వార్డును ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కార్మికుడి పరిస్థితి విషమంగా లేదని ముఖ్యమంత్రి ధామి తెలిపారు. అయితే వారిని ఇంటికి పంపించడానికి సమయం పడుతుందని, కొంత కాలం వైద్యుల పర్యవేక్షణ అవసరం అవుతుందని చెప్పారు.
రెస్క్యూ ఆపరేసన్ విజయవంతం అవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కార్మికులతో ఫోన్‌లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చాయని, వారు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ స్నేహితులను కలుసుకోవడం ఆనందాన్ని కలిగించే విషయమని ప్రధాని మోదీ అన్నారు.
కార్మికులను బయటకు తీసుకువచ్చిన వెంటనే ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారి స్ఫూర్తికి వందనం చేస్తున్నట్లు చెప్పారు. వారి ధైర్యం, సంకల్పం 41 మంది కార్మికులకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని అన్నారు. అంతకు ముందు కార్మికులు సొరంగం నుంచి బయటకు వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి ధామి, కేంద్ర మంత్రి వీకే సింగ్ వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. కరచాలనం, ఆలింగనం చేయగా, రెస్క్యూ టీమ్‌లు అధికారులు చప్పట్లు కొట్టారు.
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో నిరంతరం అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం ధమీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష అందజేస్తామని, బౌఖ్‌నాగ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని, కొండ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగాలను సమీక్షిస్తామని ఆయన చెప్పారు. నిర్మాణంలో ఉన్న సొరంగాలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ధామి తెలిపారు.