Uttarakhand Tunnel Collapse Incident: 


ఆరో రోజూ సహాయక చర్యలు..


ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిన (Uttarakhand Tunnel Collapse) చోట సహాయక చర్యలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 96 గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. నవంబర్ 12వ తేదీన ఉత్తరకాశీలోని ఈ సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలింది. అప్పటి నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లు విలవిలలాడిపోతున్నారు. అయితే...బయటకు తీసుకొచ్చే లోగా వాళ్లకు అసరమైనవి అందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి పైప్‌ల ద్వారా ఆక్సిజన్ అందిస్తోంది. ఆహారంతో పాటు మందులూ పంపుతున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు వాళ్లతో మాట్లాడుతున్నారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్లు ఏ మాత్రం అధైర్యపడకుండా జాగ్రత్త పడుతున్నారు. 2018లో థాయ్‌లాండ్‌లో ఓ సొరంగంలో చిన్నారి చిక్కుకుంటే ఓ రెస్క్యూ టీమ్‌ విజయవంతంగా ఆ బాలుడిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడిదే టీమ్‌ ఉత్తరాఖండ్‌కి చేరుకుంది. థాయ్‌లాండ్‌తో పాటు నార్వే రెస్క్యూ టీమ్‌ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. 






స్పెషల్ మెషీన్‌తో చర్యలు..


American auger మెషీన్‌ని లోపలకి పంపారు అధికారులు. ఈ మెషీన్ ద్వారా (Uttarakhand Tunnel Accident) కొండ చరియల్ని తొలగించనున్నారు. వీటిని క్లియర్‌ చేస్తే లోపల చిక్కుకున్న కార్మికులను సులువుగా బయటకు తీసుకురావడం వీలవుతుంది. ఓసారి ఈ లైన్ క్లియర్ అయితే...ఆ తరవాత 800-mm, 900mm స్టీల్‌పైప్‌లను జొప్పించనున్నారు. లోపల చిక్కుకున్న కార్మికులు ఓ వైపు నుంచి మరో వైపుకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే...ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి అధికారులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. హిమాలయా ప్రాంతాల్లో సాధారణంగా రాళ్లన్నీ కాస్త సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా అరుదుగా కొన్ని చోట్ల హార్డ్ రాక్స్‌ కనబడతాయి. ఇప్పుడు సొరంగం కూలిన చోట రాళ్లు చాలా గట్టిగా ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పని చేస్తే తప్ప వాళ్లను బయటకు తీసుకురావడం కష్టమే అంటున్నారు నిపుణులు.