Silkyara Tunnel Rescue: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో గత 17 రోజుల క్రితం చిక్కుకు పోయిన 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిని నేడు బయటకు తీసుకొస్తామని రెస్క్యూ సిబ్బంది మంగళవారం (నవంబర్ 28) ఉదయమే ప్రకటించారు. మొదట ఇద్దరు, తర్వాత మరో నలుగురుతో కాసేపటికే మొత్తం 41 మంది కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇలా మొత్తం మందిని బయటికి తీసుకురావడానికి గంటకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. సొరంగం నుంచి బయటకు వచ్చిన వెంటనే కార్మికులందరినీ అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అక్కడే ఉండి ఒక్కో కూలీని పలకరించారు.


సిల్క్యారా టన్నెల్‌లోని రెస్క్యూ వర్కర్లు కూలీలను బయటకు తీసుకురావడం కోసం తీవ్రంగా శ్రమించారు. తొలుత ప్రత్యేక ఆధునిక పరికరాలతో 58 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు. లోపలికి ఓ భారీ వేసి 17 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకు తీశారు. నవంబర్ 12న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.