Uttarakhand Tunnel Rescue Success: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికాసేపట్లో సురక్షితంగా బయటకు రానున్నారు. సిల్ క్యారా సొరంగంలో డ్రిల్లింగ్ పూర్తయి పైపులను అమర్చినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) తెలిపారు. కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. టన్నెల్ వద్ద పనులను ఆయన పరిశీలిస్తున్నారు. దాదాపు 17 రోజుల తరువాత మంగళవారం నాడు కార్మికులు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు వస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు.
సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చి, అనంతరం 41 మంది కార్మికులను చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించనున్నారు. అక్కడ వారికి చికిత్స అందించేందుకు బెడ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు పూల దండలను సైతం సిల్ క్యారా టన్నెల్ వద్దకు తీసుకువచ్చి సెలబ్రేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిందన్న విషయం తెలియగానే కార్మికుల కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇన్ని రోజులు అయితే అయింది కానీ, తమ కుటుంబసభ్యుడు ప్రాణాలతో సురక్షితంగా వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్), PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే, మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ కం BRO డీజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ (రిటైర్డ్) సిల్ క్యారా సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులను పరిశీలించి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. కార్మికులను బయటకు తీసుకొచ్చాక అంబులెన్స్ లలో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దాదాపు 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి తమ కుటుంబసభ్యుడు క్షేమంగా బయటకు వస్తున్నాడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని కార్మికుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కళ్లారా చూస్తే గానీ నమ్మకం కుదరదని, ఒక్కసారి వారిని చూశాక ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పినా, ఏదో ఆందోళనగా ఉందన్నారు. బిహార్ కు చెందిన ఓ కార్మికుడి కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. నిన్న తాను మాట్లాడినప్పుడు బాగున్నానని చెప్పారని తెలిపాడు. క్షేమంగా బయటకు వస్తారని దైర్యం చెప్పినట్లు మీడియాతో మాట్లాడారు.
మైక్రో టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ క్రిస్ కూపర్ మాట్లాడుతూ.. వర్టికల్ డ్రిల్లింగ్ నిలిపివేసి, మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేశామన్నారు. సొరంగంలోపల చిక్కుకున్న అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply