Uttarakashi Tunnel Rescue News Today: ఉత్తరకాశీ సొరంగం (Uttarakashi Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) మంగళవారం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand Chief Minister) పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 52 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయ్యిందని, మరో 57 మీటర్ల మేర తవ్వాల్సి ఉందని అంచనా వేశారు.
ఆయన రాకముందు ఒక మీటరు పైపును లోపలికి నెట్టారని, మరో రెండు మీటర్లు నెట్టినట్లయితే డ్రిల్లింగ్ 54 మీటర్లకు చేరుకుంటుందన్నారు. డ్రిల్లింగ్ సమయంలో స్టీలు గిర్డర్‌లు దొరికాయని, ప్రస్తుతం కాంక్రీటు ఎక్కువగా వస్తోందన్నారు. కట్టర్లలతో శిథిలాలను వేగంగా తొలగించి కార్మికులను సురక్షితంగా వెలుపలకు తీసుకువస్తామన్నారు. అంతకుముందు మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ ఇంతకుముందు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మూడు మీటర్ల మాన్యువల్ డ్రిల్లింగ్ జరిగిందని, 50 మీటర్ల డ్రిల్లింగ్ పని పూర్తయిందని చెప్పారు.
మంగళవారం ఉదయం రాట్ హోల్ డ్రిల్లింగ్ కార్మికుల్లో ఒకరైన నసీమ్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే 5 మీటర్ల మాన్యువల్ డ్రిల్లింగ్ పని చేసామని, మొత్తం 51 మీటర్లు పూర్తయ్యాయని చెప్పారు. ఒక్కో మీటర్ డ్రిల్ చేయడానికి 1-2 గంటల సమయం పడుతుందని, ఏమైనా అడ్డం వస్తే ఎక్కువ సమయం పట్టవచ్చన్నారు. ఇప్పటివరకు పనులు సవ్యంగా జరుగుతున్నాయని తెలిపారు.
సోమవారం సాయంత్రం నాటికి, అగర్ డ్రిల్లింగ్ మెషిన్ (Auger Drilling Machine) చివరి భాగం విరిగిపోయింది. దీంతో కార్మికులు తప్పించుకోవడానికి ఏర్పాటు చేసిన స్టీల్ పైప్ పనులు పాక్షికంగా ముగిశాయి. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాట్ హోల్ మైనింగ్ నిపుణులను పిలిపించారు. అలాగే కార్మికులను చేరుకోవడానికి ప్రత్యామ్నాయంగా మంగళవారం ఉదయం నాటికి టన్నెల్ పైనుంచి వర్టికల్‌గా 42 మీటర్ల తవ్వారు. గురువారం నాటికి సొరంగం పనులు పూర్తి చేసి, ఒక మీటర్ వెడల్పు ఉన్న ఈ షాఫ్ట్ ద్వారా కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు.
కుప్పకూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం సోమవారం శిథిలాల మీదుగా మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించింది. మొత్తం 12 మంది రాట్ హోల్ మైనింగ్ నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్ చాలా ప్రమాదకరమైనది. అంతకుముందు వరకు అగర్ మెషిన్ ద్వారా పనులు చేసేవారు. అయితే నానాటికి పనులు ఆలస్యం అవుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే టన్నెల్ పైనుంచి వర్టికల్‌గా 42 మీటర్ల తవ్వారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోడల్ అధికారి నీరజ్ ఖైర్వాల్ వివరాల మేరకు.. సైట్‌కు తీసుకువచ్చిన రాట్ హోల్ డ్రిల్లింగ్ నిపుణులు ప్రతిభావంతులని చెప్పారు. వారు ప్రత్యేక బృందాలుగా విడిపోయి, తప్పించుకునే మార్గంలో ఉంచిన స్టీల్ పైపులో చొరబడి డ్రిల్లింగ్ చేస్తారని, మరొకరు తన చేతులతో శిథిలాలను సేకరిస్తారని, మూడో వ్యక్తి దానిని బయటకు తీయడానికి ట్రాలీపై ఉంచుతాడని వివరించారు.
గత ఆదివారం టన్నెల్ పై నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 86 మీటర్లలో 42 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేశారు. గురువారం నాటికి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సోమవారం సిల్క్యారాను సందర్శించి ఆపరేషన్‌ను పరిశీలించారు. చిక్కుకున్న కార్మికులతో మాట్లాడిన మిశ్రా.. కార్మికులను రక్షించడానికి పలు ఏజెన్సీలు పని చేస్తున్నాయని, ఓపికగా ఉండాలని ధైర్యం చెప్పారు.
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ.. ఉత్తరకాశీలో వచ్చే 24 నుంచి 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసిందని, అయితే వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం లేదని ఆయన తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను తెలియజేస్తూ.. వారు సొరంగంలో రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నారని, ఆరు అంగుళాల పైప్‌లైన్ ద్వారా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్నట్లు హస్నైన్ చెప్పారు.
బయటి వ్యక్తులతో కార్మికులు మాట్లాడేందుకు ఒక పైపు ద్వారా మైక్ అందించారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రదేశంలో ఉన్న వైద్యుల బృందం, చిక్కుకున్న కార్మికులతో రోజుకు రెండుసార్లు మాట్లాడుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని అందుకు అవసరమైన మందులు, సలహాలను అందిస్తున్నారు. అలాగే కార్మికులతో కుటుంబ సభ్యులు ఎప్పుడైనా మాట్లాడేందుకు అనుమతిస్తారు. సొరంగం వెలుపల కార్మికుల బంధువుల కోసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మానసిక వైద్యులు, వైద్యులు కూడా కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు వారికి కౌన్సెలింగ్ చేస్తున్నారు.