Uttarakhand : క్లౌడ్ బరస్ట్ అనేది తరచూ ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఉత్తరాఖండ్‌లో ఈ క్లౌడ్ బరస్ట్ వార్తలు తరచూ వినిపిస్తాయి. దీని కారణంగా భారీ వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండచరియలు వంటివి విరిగిపడి ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఉత్తరాఖండ్ వంటి పర్వత ప్రాంతాల్లో అసలు ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు సంభవిస్తుంది? కారణాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
ఒక చిన్న ప్రాంతంలో (సుమారు 20-30 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో) అతి భారీ వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు. అంటే ఒక గంటలో ఈ ప్రాంతంలో పది సెంటీమీటర్లు లేదా అంత కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా గుర్తిస్తారు. అంటే తక్కువ సమయంలో పెద్ద ఎత్తున వర్షం ఆ ప్రాంతంలో కురుస్తుంది. దీని కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయి. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి విపత్తులు సంభవిస్తాయి.
ఉత్తరాఖండ్‌లో ఈ పరిస్థితి తరచూ ఎందుకంటే..?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ క్లౌడ్ బరస్ట్‌లు జరుగుతుంటాయి. అందుకు ప్రధాన కారణం అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితులే కారణం. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల నడుమ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చే తేమతో నిండిన రుతుపవనాలకు సంబంధించిన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుగా ఉంటాయి. ఈ పర్వతాలను రుతుపవన గాలులు దాటలేకపోవడం వల్ల, మేఘాలన్నీ ఒకే చోట చేరతాయి. ఈ క్రమంలో తేమతో కూడిన మేఘాలు అక్కడి చల్లని వాతావరణం కారణంగా ఘనీభవిస్తాయి. ఈ కారణంగా మేఘాలు దట్టంగా పేరుకుని మరింత బరువెక్కడం జరుగుతుంది.
ఇలా ఒకే ప్రాంతంలో తేమ అంతా భారీగా చేరుకుంటుంది. అయితే పర్వత ప్రాంతాల్లో ఉండే అస్థిర వాతావరణం అంటే చల్లని, వేడి గాలులు ఉంటాయి. ఇలా ఒకేసారి చల్లని, వేడి గాలులు ఒకదానితో ఒకటి ఢీకొనే పరిస్థితి ఉంటుంది. దీని కారణంగా వాతావరణం అస్థిరంగా మారుతుంది. దీంతో మేఘాలు ఒక్కసారిగా తమలోని నీటిని కుండపోతగా వర్షం రూపంలో కురిపిస్తాయి. దీంతో క్లౌడ్ బరస్ట్ అనేది ఏర్పడుతుంది. దీంతో పాటు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
2013లో క్లౌడ్ బరస్ట్ వల్లే కేదార్‌నాథ్ విపత్తు కూడా.
క్లౌడ్ బరస్ట్ ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేదారనాథ్ విపత్తు ఓ ఉదాహరణ. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించిన అతి పెద్ద విపత్తుల్లో ఒకటి. రుతుపవనాల ప్రభావం, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతం లో జనించి, తూర్పు వైపునకు ప్రయాణించే తుఫానుల వంటివి. ఇవి ఎక్కువగా చలికాలంలో ప్రభావం చూపిస్తాయి. ఇవి భారత ఉపఖండంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్లే ఉత్తర భారతదేశంలో వాతావరణం తీవ్ర మార్పులకు గురవుతుంది. ఇలా రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ కలయిక వల్ల అసాధారణమైన వాతావరణ పరిస్థితి 2013లో కేదరానాథ్ లో ఏర్పడింది. ఈ రెండింటి కలయిక వల్ల హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యధిక తేమతో కూడిన మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీని వల్ల అతి భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది.
అయితే ఈ క్లౌడ్ బరస్ట్ వంటి వాటిని ముందుగా గుర్తించేలా చర్యలు తీసుకుని, వరద ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ సాధారణంగా పగటిపూట సంభవించినప్పటికీ, రాత్రిపూట కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ విపత్తు వాతావరణ మార్పుల కారణంగా మరింత పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.