Donald trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (ఆగస్టు 5, 2025) నాడు మరోసారి భారతదేశంపై సుంకాలు పెంచుతామని బెదిరించారు. భారతదేశం మంచి వాణిజ్య భాగస్వామి కాదని ఆయన అన్నారు. అమెరికా ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకం విధించింది, ఇది ఆగస్టు 7, 2025 నుంచి అమల్లోకి రానుంది. వచ్చే 24 గంటల్లో భారత్‌పై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.

ఫార్మాపై 250% సుంకాలు విధిస్తాం: ట్రంప్

అమెరికా న్యూస్ ఛానల్ CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఫార్మా పరిశ్రమలపై 250% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ మాట్లాడుతూ, 'మొదట మేము మందులపై కొద్దిగా సుంకం విధిస్తాము, కానీ ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, మేము దానిని 150 లేదా 250 శాతానికి పెంచుతాము. మందులు మన దేశంలోనే తయారు కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము అలా చేస్తాము.' అని అన్నారు.

అమెరికాలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై ఒత్తిడి పెంచడంతో కంపెనీలు అమెరికాలోనే మందులు తయారు చేయాలని ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇటీవల, ప్రధాన ఔషధ సరఫరాదారులను ధరలను భారీగా తగ్గించాలని కోరారు, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మే 2025లో, వైట్ హౌస్ అమెరికాలో మందుల ధరలు ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే మూడు రెట్లు ఎక్కువని తెలిపింది. ఏప్రిల్‌లో దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై 10 శాతం సుంకం విధించిన తర్వాత, ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై వేర్వేరు రేట్లలో సుంకాలు విధించారు.

ట్రంప్‌కు రష్యా హితవు

భారత్ రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి, దానిని తిరిగి లాభానికి విక్రయిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ బెదిరింపుల మధ్య, రష్యా భారతదేశానికి మద్దతు ఇస్తూ, సార్వభౌమ దేశాలు తమ ప్రయోజనాల ఆధారంగా వాణిజ్యం, ఆర్థిక సహకారంలో తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును కలిగి ఉన్నాయని పేర్కొంది.

భారత్‌పై అమెరికా సుంకాలు పెంచుతానని నిన్న కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్అన్నారు. భారత్ భారీగా రష్యా చమురు కొనుగోలు చేసి, అధిక లాభాలకు విక్రయిస్తోందని కూడా ఆరోపించారు. ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా, యూరోపియన్ యూనియన్‌పై భారత్ ఎదురుదాడి చేసింది, దీనితో ఆగ్రహించిన ట్రంప్ ఇప్పుడు 24 గంటల్లో భారత్‌పై సుంకాలు పెంచుతామని బెదిరించారు.