రుద్రప్రయాగ్‌: ఉత్తరాఖండ్‌లోని ఘోల్తిర్ ప్రాంతంలో దాదాపు 18 మందితో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో పడిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ బస్సు రుద్రప్రయాగ్‌ నుంచి బద్రీనాథ్‌ వైపు వెళ్తున్నట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి కొంతమంది ప్రయాణికులను రక్షించింది. అయినప్పటికీ కనీసం 10 మంది వరకు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అలకనందా నది పొంగిపొర్లుతుండటంతో గల్లంతైన ప్రయాణికుల ప్రాణాలపై  ఆందోళన వ్యక్తమవుతోంది.

SDRF, NDRF బృందాలు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బస్సు గార్డ్రేల్స్‌ను ఢీకొని నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌తో సహా బస్సులోని దాదాపు 8 మందిని రక్షించారు. అయితే కొండ అంచునుంచి బస్సు నదిలో పడిపోయినప్పుడు అందులో ఇరవై మంది వరకు ఉన్నారని వారు చెబుతున్నారు. 

 IG నీలేష్ ఆనంద్ భరనే మాట్లాడుతూ.. "రుద్రప్రయాగ జిల్లాలోని ఘోల్తిర్ ప్రాంతంలో ఓ బస్సు అదుపు తప్పి అలకనందా నదిలో పడిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, బస్సులో 18 మంది ఉన్నారు. వారిలో డ్రైవర్ సహా ఎనిమిది మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది" అని తెలిపారు.