Vande Bharat Sleeper Train: స్లీపర్ వందే భారత్ రైలు మొదటి వెర్షన్ డిజైన్ తుది దశకు చేరుకుంది. కొత్త డిజైన్‌తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. దీనిని సంబంధించిన నమోనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 857 బెర్త్‌లతో కూడిన వందే భారత్ స్లీపర్ రైలు మొదటి వెర్షన్ రూపుదిద్దుకోనుంది. 2024 మార్చి నాటికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుంచి బయటకు వస్తుంది. ఇందులో ప్రయాణికుల కోసం 823 బెర్త్‌లు, సిబ్బందికి 34 ఉంటాయి. మామూలు రైలులో నాలుగు టాయిలెట్లు ఉంటాయి. అయితే స్లీపర్ వందే భారత్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. అంతేకాదు ఒక మినీ ప్యాంట్రీ ఉంటుంది.


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఈ సెమీ లైట్ స్పీడ్ ట్రైన్లలో జర్నీ చేయడం ప్రయాణికులకు సరికొత్త అనునుభూతిని కలిగిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్పీడ్, సేఫ్టీ, సర్వీస్ ఈ రైళ్ల ప్రత్యేకతని తెలిపాయి. వీటికి సంబంధించిన నమూనా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో లోయర్, అప్పర్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. మిడిల్ బెర్త్‌లు లేవు. అంతేకాకుండా పై బెర్త్‌ చేరుకోడానికి ఉపయోగించే నిచ్చెన కూడా సరికొత్తగా కనిపిస్తున్నాయి. అది పెద్ద గ్లాస్ విండో, దాని కింద వస్తువులు పెట్టు్కునేలా టేబుల్ లాంటి సౌకర్యం ఉంది.


2023 డిసెంబర్‌లో స్లీపర్-ఎడిషన్ వందేభారత్ ప్రోటోటైప్ సిద్ధమవుతుందని, మార్చి 2024లో విడుదల చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్లీపర్ వందే భారత్ రైలు తుది డిజైన్ అనేక మార్పులకు గురైందని వైష్ణవ్ వివరించారు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నందున స్లీపర్ డిజైన్‌లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కోసం భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) 10 స్లీపర్ వందే భారత్ రైళ్లను తయారు చేస్తోంది. ఈ మేరకు BEML డిజైన్‌ను ఖరారు చేసింది. ఇప్పటి వరకు ఉన్న రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యాధునిక వసతులు, గణనీయమైన మార్పులు ఉంటాయి. ఈ హై-స్పీడ్ రైళ్లు రాత్రిపూట ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. 


అలాగే 200 స్లీపర్ వందే భారత్ రైళ్ల తయారీకి TMH-RVNL, BHEL-Titagarh వ్యాగన్ల కన్సార్టియమ్‌లకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఇచ్చింది. స్లీపర్ వందే భారత్ రైళ్లన్నీ ఒకే డిజైన్‌ను కలిగి ఉంటాయని, తుది డిజైన్‌ను TMH, Titagarh ఆమోదించనున్నాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు. స్లీపర్ బెర్త్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా స్లీపర్ వందే భారత్ రైళ్లు డిజైన్ చేయబడ్డాయని అన్నారు. పై బెర్త్‌ను సులభంగా చేరుకునేలా డిజైన్ ఉంటుందని మంత్రి తెలిపారు. రాత్రికి రాత్రి దూరప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ వందేభారత్ స్పీపర్ కోచ్‌లు సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన చెప్పారు.


న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడిచే తొలి వందేభారత్ భారత్ రైలును 2019 ఫిబ్రవరి 15న మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 'మేక్ ఇండియా' ఇనేషియేటివ్ కింద చెన్నైలోని ఇండిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యా్న్ని చాటిచెప్పింది. ఐసీఎప్-చెన్నై 2017 మధ్యలో తయారీ ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసింది.