Sanatana Dharma Row: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష I.N.D.I.A కూటమిపై విరుచుకుపడ్డారు. కొందరు నాయకులు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారన్న అనురాగ్ ఠాకూర్.. నఫ్రత్ కా మెగా మాల్ (విద్వేషపూరిత మాల్) ను ప్రారంభించారని అన్నారు. 


రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. మొహబ్బత్ కి దుకాన్ (ప్రేమ దుకాణం) గురించి నాకు తెలియదు, కానీ కొంతమంది విద్వేషపూరిత మాల్ ను ప్రారంభించారని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని I.N.D.I.A కూటమి నాయకులు అంటున్నారని, నఫ్రత్ కి దుకాన్ తెరవాడనికి రాహుల్ గాంధీ వారికి లైసెన్స్ ఇచ్చారన్నది స్పష్టం అవుతోందని కేంద్రమంత్రి అన్నారు. 


I.N.D.I.A కూటమిపై మోదీ విమర్శలు


మధ్యప్రదేశ్‌ పర్యటనలో బహిరంగ సభలో పాల్నిగొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమికి లీడర్ లేడని సెటైర్లు వేశారు. ఓ వైపు భారత దేశం ప్రపంచ దేశాలను ఏకంచేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంటోందని, మరో వైపు మాత్రం ఓ దళం దేశాన్ని విడగొట్టాలని చూస్తోందని మండి పడ్డారు. ఇలాంటి వాళ్లంతా కలిసి ఓ కూటమి పెట్టుకున్నారని, భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా అని తేల్చి చెప్పారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలన్నదే వాళ్ల కుట్ర అని మండి పడ్డారు. 


'ఓవైపు భారత్‌ ప్రపంచ దేశాలను ఏకం చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. విశ్వమిత్ర అనే పేరు సాధించుకుంది. కానీ ఇదే దేశంలో ఓ కూటమి మాత్రం దేశ ప్రజల్ని విడగొట్టే రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకే ఈ I.N.D.I.A కూటమిని కొందరు ఘమండియా కూటమి అని కూడా పిలుస్తున్నారు. అసలు ఈ కూటమిని లీడర్ ఎవరో తెలియదు. ముంబయిలో ఈ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ ఘమండియా కూటమి ఎలా పని చేయాలన్నది ఆ భేటీలో నిర్ణయించుకున్నారు. ఓ రహస్య అజెండాని కూడా తయారు చేసుకున్నారు. భారత దేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా. సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడమే వీళ్ల లక్ష్యం.ఇవాళ బహిరంగంగానే కొందరు సనాతన ధర్మంపై మాటల దాడి చేస్తున్నారు. రేపు మనపైనా దాడులు చేస్తుండొచ్చు. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మనం కచ్చితంగా కట్టడి చేయాలి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


ఇదే సమయంలో G20 సదస్సు గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. G20 సదస్సుపై మీ అభిప్రాయమేంటి అంటూ ప్రజల్నే అడిగారు మోదీ. దీనిపై అక్కడి వాళ్లంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సక్సెస్ క్రెడిట్ తనది కాని, ఇది 140 కోట్ల మంది దేశ పౌరుల విజయం అని వెల్లడించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలు చూడలేదని అన్నారు. దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని, పేదల కలలను నెరవేర్చడమే తమ లక్ష్యం అని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.