Saif Ali Khan Attack Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల ఓ దుండగుడి కత్తి దాడిలో గాయపడ్డ సైఫ్.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఈ కేసుపై బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రను సేకరించారు. ఈ సందర్భంగా వెలువడిన ఫలితాలలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలకపోవడంతో అధికారులు తప్పుడు వ్యక్తిని పట్టుకున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ సరైన సాక్ష్యాధారాలతోనే షరీఫుల్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్న మాట. ఇప్పుడు ఈ కేసును పటిష్టం చేయడానికి ముంబై పోలీసులు (Mumbai Police) మరిన్ని ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు.
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు Bollywood నటుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాడి జరిగిన ప్రదేశంలో దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. అయితే ఇప్పుడు వాటిల్లో ఏవీ కూడా నిందితుడి వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని ఫోరెన్సిక్ బృందం పోలీసులుకు చెప్పినట్టు సమాచారం. మరిన్ని పరీక్షల కోసం మరోసారి ఘటనాస్థలం నుంచి మరిన్ని ఫింగర్ ప్రింట్స్ శాంపిల్స్ ను కలెక్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన పోలీసులు
కేసు విచారణలో భాగంగా సైఫ్ రక్త నమూనాలను ముంబై పోలీసులు సేకరించారు. దాంతో పాటు నిందితుడు దుస్తులపైనా రక్తపు మరకలు కనిపించాయి. అవి సైఫ్ వేనా అని నిర్థారించేందుకు దాడి జరిగిన రోజు సైఫ్ ధరించిన దుస్తులను కూడా పోలీసులు సేకరించారు. ఆ తర్వాత దుండగుడి దుస్తులతో పాటు, సైఫ్ రక్త నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అయితే తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, పోలీసులు సేకరించిన 19 వేలిముద్రల్లో ఓ ఒక్కటీ కూడా షరీఫుల్ 10 వేళ్లతో మ్యాచ్ కాకపోవడంతో ఈ కేసు మళ్లీ మొదటికే వచ్చినట్టయింది.
జనవరి 16న సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను దాదాపు 72 గంటల గాలింపు తర్వాత జనవరి 19న మహారాష్ట్రలోని థానేలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ముంబై పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన దాదాపు 40 బృందాలు పాల్గొన్నాయి. అంతకంటే ముందు నిందితుడిగా పేర్కొంటూ ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ పలుమార్లు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ తర్వాత సమీపంలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరు గంటలపాటు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆస్పత్రి తర్వాత డిశ్చార్జ్ అయిన సైఫ్.. ఇప్పుడు కోలుకుంటున్నారు.