Just In





Ugly Girls Can Be Married Off: 'అమ్మాయికి అందం లేకపోతే పెళ్లికి కట్నం ఇవ్వాల్సిందే'- సిలబస్‌లో షాకింగ్ విషయాలు
నర్సింగ్‌కు సంబంధించిన ఓ పాఠ్య పుస్తకంలో వరకట్నాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు ఉండటం సంచలనంగా మారింది.

కట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ చట్టరీత్యా నేరం. అయినా ఇప్పటికీ కట్నం లేనిదే పెళ్లిళ్లు జరగడం కష్టమే. ఎన్నో దశాబ్దాలుగా నడుస్తోన్న ఈ అనాగరిక చర్యను ఆపేందుకు సంఘ సంస్కర్తలు, మీడియా కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వరకట్నానికి ఆడపిల్లలు బలైపోతూనే ఉన్నారు. వరకట్నాన్ని వ్యతిరేకించాల్సింది పోయి దానిని సమర్థిస్తూ ఏకంగా పాఠ్యపుస్తకాల్లో పాఠాలు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. అవును నర్సింగ్ విద్యార్థులకు బోధించాల్సిన పాఠ్యపుస్తకంలో కట్నం గురించి సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఏంట్రా ఇది?
అందంగా లేని అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు కట్నం ఉపయోగపడుతుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ పుస్తకంలో రాయడం సంచలనంగా మారింది. "వరకట్న వ్యవస్థ యోగ్యతలు, ప్రయోజనాల" జాబితాతో ఈ వివరాలు ఉన్నాయి. ఈ పుస్తక పేజీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందంగా లేని అమ్మాయిలకు పెళ్లిళ్లు కావాలంటే కట్నం ఇవ్వాలని సదరు పాఠ్యాంశంలో పేర్కొన్నారు.
డిమాండ్
ఇలాంటి విషయాలను పాఠ్య ప్రణాళికలో ముద్రించడం వల్ల సమాజం చెడుదోవ పట్టే అవకాశం ఉందని పేర్కొంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ పేజీ ఫొటోను ట్వీట్ చేశారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ట్యాగ్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలను పాఠ్యాంశాలలో తొలగించాలని డిమాండ్ చేశారు. ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లు, వాహనాలు వంటి ఉపకరణాలతో నూతన కుటుంబాన్ని స్థాపించడంలో కట్నం సహాయకరంగా ఉంటుందని పుస్తకంలో పేర్కొనడం అవమానకరం అని మండిపడ్డారు.