ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఇకపై తప్పనిసరిగా ప్రాథమిక వివరాలను వెబ్‌సైట్లలో బహిర్గతం చేయాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, తమ వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా ఉంచాల్సిన కంటెంట్‌కు సంబంధించి ఓ చెక్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటులో లేకపోతే విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంటుందని యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్ కుమార్‌ తెలిపారు. ఈ కారణంతోనే విద్యాసంస్థలు వెబ్‌సైట్లలో పొందుపరచాల్సిన అంశాలతో చెక్‌లిస్ట్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. 


ఏమేం పెటాలంటే
విద్యా సంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్లలో ఫీజులు, రిఫండ్‌ పాలసీ, హాస్టల్‌ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్‌, ర్యాంకింగ్స్‌, అక్రిడిటేషన్‌ వంటి వివరాలను పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. కొన్ని విశ్వవిద్యాలయాలు తమ వెబ్‌సైట్లలో ప్రాథమిక సమాచారాన్ని పెట్టకపోవడం,అప్‌డేట్‌ చేయడం లేదు. ఉన్నత విద్యాసంస్థలు, వర్సిటీల పేటెంట్ల వివరాలు, విదేశీ, పరిశ్రమలతో సహకారం, అంతర్గత నాణ్యత భరోసా కేంద్రం వంటి వివరాలను తెలియజేయాలి. అంబుడ్స్‌మన్‌, అనుబంధ కళాశాలలు, ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం, పౌర సంబంధాల విభాగం, అప్పిలేట్‌ అథారిటీ తదితర వివరాలతో యూజీసీ చెక్‌లిస్ట్‌ రూపొందించింది. అంతేకాకుండా అంతర్గత ఫిర్యాదుల కమిటీ, హెల్ప్‌లైన్‌తో కూడిన యాంటీ ర్యాగింగ్‌ సెల్‌, సమాన అవకాశాలకు సంబంధించిన విభాగం, పూర్వ విద్యార్థుల సంఘం వివరాలను చెక్ లిస్టులో పెటాలి. 


ఆధార్ నంబర్ ను ముద్రించొద్దు
విద్యార్థుల మార్కుల జాబితా, ఇతర సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ను ముద్రించడానికి వీలు లేదని, గతంలో యూజీసీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విష‌యంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, కొన్ని సంస్థలు ఆధార్ నంబ‌ర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప‌రిధిలోని యూనివ‌ర్సిటీలు విద్యార్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబ‌ర్లు ముద్రిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం బయటకు వెళుతుందని భావించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సర్టిఫికెట్లపై ఆధార్ ను  ముద్రించడం నిలిపివేయాలని ఆదేశించింది. విద్యార్థుల ప్రైవేట్ డేటాబేస్‌ను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. 


ప్రతి ఒక్క యూనివర్శిటి యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం యూజీసీకి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ సంస్థ ఆదేశించినట్లు విద్యార్ధుల ప్రొవిజనల్స్, మార్క్ లిస్ట్ పై ఆధార్ కార్డు నెంబర్ ను ముద్రించడం వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాల్సిందేనని యూజీసీ యూనివర్శిటీలను ఆదేశించింది. విద్యార్థుల వివరాలను బహిర్గతం చేసే వివరాలను వెల్లడించకూడదని యూజీసీ ఆదేశించింది. ఇప్పటే ఆధార్ విశిష్ట నంబర్ ను అన్ని సంక్షేమ పథకాల లబ్దికోసం, అప్లికేషన్ల కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో గుర్తింపు కోసం ఉపయోగిస్తున్నారు. స్థానికతను నిర్థారణ చేసుకోవడానికి కూడా ఆధార్ నంబర్ ను ఉపయోగిస్తు్న్నారు.