Udaipur Murder Case: మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భాజపా సస్పెండ్ చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.
వెంటనే అరెస్ట్
ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్.. టైలర్ గొంతు కోయగా, గౌస్ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.
మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.
144 సెక్షన్
ఈ ఘటనపై నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో రాజస్థాన్ వ్యాప్తంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఉద్రిక్తతలు పెరగడంతో ఉదయ్‌పుర్‌లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సీఎం అశోక్ గహ్లోత్.. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు.
రంగంలోకి ఎన్‌ఐఏ
ఘటనపై ఆందోళనలు పెరగడంతో ఉదయ్‌పుర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్‌ఐఏ బృందాన్ని పంపింది. ఈ ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ ఘటనలో ఉగ్రసంస్థలు, అంతర్జాతీయ ప్రమేయాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
ఇలా జరిగింది
మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లో టైలర్‌గా పనిచేస్తున్నాడు. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Maharashtra Political Crisis: క్లైమాక్స్ చేరిన మరాఠా రాజకీయం- అసెంబ్లీలో గురువారమే బలపరీక్ష