Maharashtra Political Crisis: క్లైమాక్స్ చేరిన మరాఠా రాజకీయం- అసెంబ్లీలో గురువారమే బలపరీక్ష

ABP Desam   |  Murali Krishna   |  29 Jun 2022 11:04 AM (IST)

Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు గవర్నర్ సీఎంకు లేఖ రాశారు.

(Image Source: PTI)

Maharashtra Political Crisis: గత వారం రోజులుగా రసవత్తరంగా సాగుతోన్న మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి లేఖ రాశారు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రభుత్వం నుంచి వైదొలగాలని చూశారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను కలిశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, బలపరీక్ష కోసం అడిగారు.                                              - భగత్ సింగ్ కోష్యారి, మహారాష్ట్ర గవర్నర్

5 గంటలకు

గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశించారు. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైంది.

సుప్రీంలో సవాల్

గవర్నర్ ఆదేశాలపై శివసేన మండిపడింది. ఈ సమయంలో బలపరీక్ష కోసం గవర్నర్ కోరడం అన్యాయమని ఆరోపించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో శివసేన వేసిన పిటిషన్ విచారణకు న్యాయస్థానం అనుమతించింది.

మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష చేయాలని కోరడంపై మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేం చేసిన అభ్యర్థన సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో బలపరీక్ష కోరడం అన్యాయం. దీని కోసమే గవర్నర్ ఎదురుచూశారు.                                        - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ 

గోవాకు

మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యులు బుధవారం గోవా చేరనున్నట్లు సమాచారం. వీరి కోసం తాజ్ రిసార్ట్‌లో 70 గదులను బుక్ చేశారు. అనంతరం గురువారం వీరంతా ముంబయి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

భాజపా కూడా తమ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం ముంబయి తాజ్‌ హోటల్‌కు రావాలని ఆదేశించింది.

Also Read: mohammed zubair Remand : జర్నలిస్ట్ జుబేర్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీ - అరెస్ట్‌ను ఖండించిన విపక్షాలు !

Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్

Published at: 29 Jun 2022 10:52 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.