Operation Akhal: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ అఖల్ 9వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శనివారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ తెలిపింది.

లాన్స్ నాయక్ ప్రిత్‌పాల్ సింగ్, జవాన్‌ హర్మిందర్ సింగ్‌ దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేశారని ఆర్మీ పేర్కొంది. "దేశం కోసం విధి నిర్వహణలో వీర సైనికులైన ప్రిత్పాల్ సింగ్, హర్మిందర్ సింగ్  ప్రాణ త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుంది. వారి ధైర్యం, అంకితభావం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి" అని ఎక్స్ పోస్ట్ చేసింది.

ఆగస్టు 1న ప్రారంభమైన ఆపరేషన్ అఖల్‌ జమ్మూ కశ్మీర్‌లో అత్యంత సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేష్‌గా మారింది. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్దిష్ట సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ అండ్‌ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.