Bangalore: దివ్యాంగుల గురించి అవహేళనగా మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేసినందుకు ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మూగ చెవిటి వారికి సంబంధించిన సంకేత భాషను ఎగతాళి చేయడంతోపాటు వారిపట్ల అమర్యాదగా మాట్లాడినందుకు రోహన్ కరియప్ప, షాయన్ భట్టాచార్యలను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ (NAD) ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జూలై మూడో వారంలో దాఖలైన ఫిర్యాదులో, ఇది సెక్షన్ 21 మరియు ఐటీ చట్టం 2000 ప్రకారం గౌరవంగా జీవించే హక్కు చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. బెంగళూరులోని బధిరుల సంఘం సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
వీరిద్దరు బెంగళూరుకు చెందిన వారు కావడంతో ఢిల్లీ పోలీసులు నగర పోలీసుల సహాయాన్ని ఆశ్రయించారు, ఆ తర్వాత వారిని అరెస్టు చేశారు. రోహన్ కరియప్ప, షాయన్ భట్టాచార్య అలియాస్ RJ షాయన్ ఇద్దరూ రేడియో జాకీలు. దీంతో ఇద్దరూ ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. వీడియోలో ఒక సంకేత భాషా వ్యాఖ్యాతగా సక్రమంగా సంజ్ఞలు చేయడం, వినోదం ముసుగులో అభ్యంతరకరమైన పదజాలం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీరిద్దరి చర్య బధిర సమాజాన్ని అవమానపరిచేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. వీడియో ఆర్‌పిడబ్ల్యుడి చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా వారు పేర్కొన్నారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ని సృష్టించి, షేర్ చేసినందుకు ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు అరెస్ట్
ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనే తెలంగాణలో కూడా జరిగింది. తండ్రీకూతుళ్ల రిలేషన్‌పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్ముంతును సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రణీత్ హన్మంతుపై ఐటీ యాక్ట్, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంలోని వివిధ సెక్షన్లతోపాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
Also Read: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
తండ్రీకూతుళ్ల బంధంపై ప్రణీత్ హన్మంతు మరికొందరితో కలిసి సోషల్ మీడియాలో తప్పుడు కూతలు కూశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటులు సాయిధరమ్ తేజ్‌దీనిపై మొదట ఫిర్యాదు చేశారు. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయింది. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విషయ తీవ్రత గుర్తించిన అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రణీత్ హన్మంతు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. కానీ, దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు ప్రణీత్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Also Read: వానలు కురిసిన ఆనందంలో గాడిదలకు గులాబ్ జామూన్‌లు తినిపించిన గ్రామస్థులు - వీడియో