Russia Ukraine Conflict: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 23వ తేదీన ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్టు సమాచారం. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అవనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికి మూడేళ్లు గడిచాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్రతరమవుతూనే ఉంది. దీనిపై మోదీ ప్రభుత్వం తమ వైఖరి ఏంటో చాలా సందర్భాల్లో తేల్చి చెప్పింది. అయితే...ఈ యుద్ధం మొదలైన తరవాత తొలిసారి ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఇటీవలే మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. పుతిన్‌తో సమావేశమయ్యారు. అంతకు ముందు జీ7 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఉక్రెయిన్ విషయంలో భారత్‌ వైఖరి ఎలా ఉండనుందన్న ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే...మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు ఉక్రెయిన్ కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. జులై 8వ తేదీన మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. పుతిన్ ఆయనకు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. అంతే కాదు. మోదీని కౌగిలించుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 


ఉక్రెయిన్‌పై అంత దారుణాలు పాల్పడుతున్న రష్యాతో భారత్‌ అంత సన్నిహితంగా ఉండడమేంటని ప్రశ్నించారు. సరిగ్గా అదే రోజు కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన జెలెన్‌స్కీ భారత్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. మోదీ, పుతిన్ ఇలా కౌగిలించుకోవడం, అంత సన్నిహితంగా ఉండడంపై మండి పడ్డారు. ఈ పోస్ట్‌పై భారత్ కూడా గట్టిగానే స్పందించింది. ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వాళ్లు నిర్ణయాలు తీసుకునే హక్కు అన్ని దేశాలకూ ఉంటుందని, అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని తేల్చి చెప్పింది.