ED Officials Arrested:



ఈడీ అధికారులు అరెస్ట్..


రాజస్థాన్ యాంటీ కరప్షన్ యూనిట్ ఇద్దరు ఈడీ అధికారులను అరెస్ట్ చేసింది. నవల్ కిశోర్ మీనా అనే అధికారి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మణిపూర్‌లోని ఓ చిట్‌ఫండ్ కేసులో నవల్ కిశోర్ శర్మ మీనా, బాబులాల్ మీనా లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చిట్‌ఫండ్ కేసుని క్లోజ్ చేసేందుకు లంచం అడిగారు ఈ ఇద్దరు ఈడీ అధికారులు. అడిగినంత డబ్బు ఇస్తే కేసు కొట్టేయడంతో పాటు అరెస్ట్ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. అంతే కాదు. ఆస్తులనీ సీజ్ చేయకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.17 లక్షల లంచం అడిగారు. చివరకు రూ.15 లక్షలకు డీల్ కుదిరింది. అయితే...ACB అధికారులు చిట్‌ఫండ్ కేసు విచారణలో భాగంగా పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆదాయంలో అవకతవకలు ఉండడం సహా ఈ కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై నవల్ కిశోర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆ క్రమంలోనే ఆయన లంచం తీసుకున్నట్టు గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అధికారులనూ అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ఈడీ సోదాలు అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్ గహ్లోట్‌ని అక్టోబర్ 30వ తేదీన 9 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రూల్స్‌ని ఉల్లంఘించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 25 న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 


అశోక్ గహ్లోట్‌కి కొడుకుకి సమన్లు..


రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ స్పందించారు. బీజేపీ హయాంలో దర్యాప్తు సంస్థలపై నమ్మకం  తగ్గిపోయిందని మండి పడ్డారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని అన్నారు. దేశమంతా భయాన్ని సృష్టించడమే బీజేపీ లక్ష్యం అని అసహనం వ్యక్తం చేశారు.