Trainee Aircraft:
కలబురగిలో ఘటన..
కర్ణాటకలో ఓ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కర్ణాటకలోని కలబురగిలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా ఉన్నట్టుండి రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు మహిళా పైలట్‌లున్నారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే...ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్‌గా ఉందని వివరించారు. పంట పొలాల్లో పడిపోవడం వల్ల కొంత మేర పంట నష్టం జరిగింది. కలబురగి ఎయిర్‌పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయల్దేరిన ఆ విమానం...ఉదయం 9 గంటల ప్రాంతంలో పంటపొలాల్లో ల్యాండ్ అవ్వగా...ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కాసేపటికే ఏదో ఓ టెక్నికల్ ఎర్రర్ తలెత్తడం...అవి ఉన్నట్టుండి ల్యాండ్ అవ్వడం వల్ల పైలట్స్‌కి గాయాలవుతున్నాయి. ఒక్కోసారి ఈ సాంకేతిక సమస్యలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గతంలో జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇటీవల మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌మార్గ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్‌గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.