Andhra Pradesh CM Chandrababu Targeted: ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని, అవినీతిపరులైన నేతల అండతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. అవినీతిపరులైన నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషులు అయ్యారా..? అంటూ నిలదీశారు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే, ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని పేర్కొన్నారు. 


గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోడీ, ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనే ఊత కర్రల సాయంతో సభలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ రెండు కర్రలు పట్టుకునే దేశ, విదేశాల్లో మోడీ తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో మాదిరిగా ప్రధాని మోదీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష రాజకీయ నేతలపై సిబిఐ దాడులను ప్రస్తావించిన బెనర్జీ.. ఎన్డీఏ పక్షాల నేతలపై కేసులు అంశాన్ని తూర్పారబట్టారు. అవినీతిపరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోడీ పదేపదే ఆరోపణ చేశారని, మరి చంద్రబాబు, అజిత్ పవర్, ప్రపుల్ పటేల్ విషయంలో జరిగిందేమిటో..? అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. సిబిఐ, ఈడీలు చంద్రబాబును అరెస్టు చేస్తాయా..? అని నిలదీశారు. టిడిపి అధినేతను ఎందుకు సిబిఐ, ఈడి అరెస్టు చేయడం లేదని బెనర్జీ ప్రశ్నించారు. బిజెపి పంచన చేరగానే వాషింగ్ మిషన్ లో వేసిన మాదిరిగా వారంతా శుద్ధ పురుషులు అయ్యారంటూ..? ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం మోడీ ప్రభుత్వానికి ఏర్పడిందని దుయ్యబెట్టారు.


ఆ నేతకు అంత ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్న..


ఎన్నికల సర్వేల అంశాలపై కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాలు రోజున ఒకవైపు స్టాక్ మార్కెట్ పడిపోయి రూ.31 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి అయిపోతే, టిడిపి అగ్రనేతకు చెందిన కంపెనీ మాత్రం రూ.520 కోట్లు ఒక్కరోజులోనే అర్జించిందని వెల్లడించారు. ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఎన్నికల అధికారులు బిజెపికి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలను స్ప్రెడ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను కౌంటర్ చేసే పనిలో టిడిపి నాయకులు నిమగ్నమయ్యారు. కళ్యాణ్ బెనర్జీ చేసిన ఊతకర్రల వ్యాఖ్యలపై టిడిపి ఎంపీ శబరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఊత కర్ర కాదని, కత్తి అంటూ పేర్కొన్నారు.