Modi Address NEET Paper leak: నీట్‌ పేపర్‌ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన మోదీ.. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథాగా పోనివ్వమని మోదీ తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసే వారిని వదిలిపెట్టబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్‌ విద్యార్ధులకు భరోసానిచ్చారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మోదీ స్పష్టంచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టాన్ని రూపొందించిందని ప్రధాని మోదీ చెప్పారు.


ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ..
ప్రధాని మోదీకి పార్లమెంట్ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్‌పై చర్చను ప్రధాని మోదీనే నడిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






రాష్ట్రపతి ప్రసంగంలోనూ లీకేజీ మాట..
నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఇటీవల స్పందింన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము స్పందించారు. నీట్ పేప‌ర్ లీకేజీ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు. అలాగే ప్ర‌భుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉందని తెలిపారు. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌ల ప్ర‌క్రియను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.



అమల్లోకి 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్...
పేపరు లీకేజీలకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకుగాను యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను పొందినా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. పేపరు లీక్ చేసేవాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధించే వెసుబాటు ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే.. వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.