Third Front Alliance: 


మూడో కూటమి తప్పదా..?


లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. పైగా జమిలీ ఎన్నికలు జరిగే సంకేతాలు వస్తుండడం వల్ల కసరత్తుని వేగవంతం చేశాయి. ఇప్పటికే మోదీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి I.N.D.I.A కూటమిగా ఏర్పడ్డాయి. దాదాపు 28 పార్టీలు ఇందులో చేరాయి. అటు NDA కూడా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న TRS మాత్రం ఈ రెండు కూటముల్లోనూ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దేశంలో మోదీ సర్కార్‌ని గద్దె దించేందుకు థర్డ్‌ ఫ్రంట్‌ (Third Front) ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని,అందుకు కేసీఆర్ చొరవ చూపించాలని అన్నారు. ఆ కూటమికి కేసీఆర్ నేతృత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, మాయావతి లాంటి నేతలు ఆ రెండు కూటముల్లో లేరని, అలాంటి వ్యక్తుల అవసరం ఇప్పుడు ఉందని వెల్లడించారు. 


"దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్‌కి అవకాశముంది. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలు మిగతా కూటముల్లో లేరు. అందుకే మూడో కూటమి ఏర్పాటుకు స్కోప్‌ కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ థర్డ్ ఫ్రంట్‌కి నేతృత్వం వహించాలి. అప్పుడు రాజకీయాల్లో ఏం మార్పులొస్తాయో  మీకే తేడా తెలుస్తుంది"


- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 






కాంగ్రెస్‌పై విమర్శలు..


హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ సమావేశాలపైనా విమర్శలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ. దళితులు, ఓబీసీల రిజర్వేషన్‌లు పెంచాలని చెబుతున్న కాంగ్రెస్...ముస్లిం రిజర్వేషన్‌ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లోనూ దీనిపై ప్రస్తావించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 


"మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేసింది..? రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఏమైనా చేసుంటే మాకు చూపించండి. హరియాణాలో ఇద్దరు ముస్లింలను కాల్చి చంపారు. వాళ్లకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చారు. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఉగ్రవాది చేతిలో ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షల పరిహారం ఇచ్చారు. ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన వాళ్లపైనా కాంగ్రెస్ వివక్ష చూపిస్తోంది"


- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్


బీజేపీపై ఆగ్రహం..


కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని, ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైందని విమర్శించారు ఒవైసీ. కానీ తెలంగాణలో పరిస్థితులు ఇలా లేవని, ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కాలేజీలు, స్కూళ్లకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారని చెప్పారు. ముస్లింలపై దాడులూ జరగడం లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా బాగుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లో జవాన్లు అమరులవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు. ఒకవేళ అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికి బీజేపీ నానా రభస చేసి ఉండేదని అన్నారు. బీజేపీ ఇప్పుడు ఎందుకింత మౌనంగా ఉంటోందో చెప్పాలని డిమాండ్ చేశారు. 


Also Read: బర్త్‌డే రోజూ బిజీబిజీగా ప్రధాని, యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌ని ప్రారంభించిన మోదీ