PM Modi In Gujarat Tour | గాంధీనగర్: రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది 1947లోనే కాశ్మీర్‌లోని ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సింది అని మోదీ అన్నారు. విభజన తర్వాత మొదటి ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో తగిన రీతిలో బుద్ధిచెప్పి ఉంటే దశాబ్దాల నుంచి భారత్‌ ఉగ్రవాదం ముప్పు ఎదుర్కునేది కాదన్నారు.

తొలి దాడితోనే అప్రమత్తం అయి ఉంటే..గుజరాత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనేది భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పరిష్కరించని అతిపెద్ద సమస్య. 1947లో పాకిస్తాన్‌ నుంచి తొలి దాడి జరిగిన సమయంలోనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సూచనను తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పట్టించుకోలేదు. ఒకవేళ ఆనాడు సర్ధార్ పటేల్ సూచన మేరకు భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఎదురుదాడి చేసి ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ అనే సమస్య, ఉగ్రవాద సమస్య సైతం భారత్‌కు తప్పేవి. 

1947లో అదేరోజు కాశ్మీర్‌ లో కొంత భాగం ఆక్రమణ

"1947లో అఖండ భారతదేశం మూడు ముక్కలైంది. స్వాతంత్య్రం వచ్చిన రాత్రి కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. భారత్ (కాశ్మీర్ లోని) భూభాగాన్ని పాకిస్తాన్ 'ముజాహిదీన్' పేరుతో బలవంతంగా ఆక్రమించగా అది పీఓకే అయింది. ఆ రోజు, ముజాహిదీన్లపై దాడి చేసేందుకు సైన్యాన్ని ఆదేశించి ఉంటే వారిని మృత్యువు వరించేది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించకూడదని సర్దార్ పటేల్ ఆనాడే కోరారు. కానీ సర్దార్ మాటలను అప్పటి ప్రధాని, ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన విషయాలు వెల్లడించారు. 

సైన్యాన్ని వెనక్కి రప్పించవద్దన్న సర్ధార్ పటేల్..

పీఓకే తిరిగి స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని నిలువరించవద్దని పటేల్ ఎంత చెప్పినా, అప్పటి ప్రభుత్వం ఆయన మాటలు వినలేదు. దాంతో గత 75 సంవత్సరాలుగా ఉగ్రవాదుల రక్తపాతం కొనసాగుతోంది. పహల్గావ్‌లో జరిగింది కేవలం ఒక్క ఘటన మాత్రమే. భారత సైన్యం ప్రతిసారీ పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్‌పై విజయం అసాధ్యమని పాకిస్తాన్ అర్థం చేసుకుంది. పాక్ ప్లాన్ చేసి మరీ దాడులకు పాల్పడుతోంది. అయితే నేరుగా యుద్ధం చేయకుండా వీలు చిక్కినప్పుడల్లా ఉగ్ర దాడులతో పాక్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది. అది వారి వ్యూహంలో భాగం. అని భారత సరిహద్దులో ఉగ్రవాద దాడులను ప్రధాని మోదీ ప్రస్తావించారు. 

కాగా, ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ నేపాల్ వ్యక్తి ఉన్నారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి అంతా ధ్వంసం చేయడం తెలిసిందే. కేవలం ఉగ్రవాదులను భారత్ లక్ష్యంగా చేసుకుందని, పాక్ సైన్యం, పాక్ పౌరులకు ఏ హాని తలపెట్టలేదని కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. అనంతరం పాక్ డ్రోన్ దాడులు, సరిహద్దుల్లో కాల్పులు జరపగా.. భారత బలగాలు వాటిని తిప్పికొట్టాయి. పాక్ లోని పలు నగరాల్లో ఎయిర్ బేస్ స్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించి బుద్ధి చెప్పాయి.