Maoist chief Sambala Kesava Rao : మావోయిస్టు చీఫ్‌ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన ప్రకటన జారీ చేసింది.  సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది. తమకు తాము ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించినట్టు వెల్లడించింది. చనిపోయిన వారి ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు.   దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సహచరుడు, భారత విప్లవ ఉద్యమ గొప్ప నాయకుడు, ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్), కామ్రేడ్ నంబాల కేశవరావుకు నివాళి అర్పిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. నారాయణపూర్ జిల్లా, మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2025 మే 21న జరిగిన మారణహోమంలో ప్రాణాలు త్యాగం చేశారని అభివర్ణించారు. 

కేశవరావుతోపాటు వీరమరణం పొందిన నాగేశ్వర్‌రావు, సంగీత, భూమిక, వివేక్, చందన్ అలియాస్ మహేశ్, గుడ్డు, కమల్సు, రమేష్‌, రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హంగీ, సంకి, బద్రు, నీలేష్, సంజు అందరికీ నివాళులర్పించారు. ఈ కామ్రేడ్‌ల నెరవేరని కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు వివరించారు.  

అమరవీరుల జ్ఞాపకార్థం షహీద్ స్మృతి సభలు నిర్వహించాలని, ఆశయాలు నెరవేర్చాలనే పోరాట మార్గంలో ముందుకు సాగాలని విప్లవ సంస్థలకు పిలుపునిచ్చింది. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం కుట్రలో ఈ క్రూరమైన ఊచకోత ఖండిస్తున్నామన్నారు.  

పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్‌లో ఉన్నారని పోలీసులకు ముందే తెలుసన్నారు. ఈ 6 నెలల్లో వివిధ యూనిట్ల నుంచి కొంతమంది పోలీసులకు లొంగిపోయి దేశద్రోహులుగా మారారన్నారు. వారి ద్వారా రహస్య సమాచారం అందుతూనే ఉందన్నారు. బిఆర్ దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చి ఫేక్ వార్తలు వేశారని ఆపరేషన్‌లు చేపట్టారని తెలిపారు. గత నెలన్నరగా దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న CYPC సభ్యులతోపాటు చాలా మంది లొంగిపోయారని గుర్తు చేశారు. వీరిలో యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు ఉన్నాడని వారి ద్వారనే పని సులువైందన్నారు. రీకీతో సహా లొంగిపోయిన దేశద్రోహులందరూ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆరోపించారు. ఈ దేశద్రోహుల కారణంగానే ఇంత పెద్ద నష్టం జరిగిందని అన్నారు. 

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలును కూడా మావోయిస్టులు లేఖలో వివరించారు. "ఈ పథకం కింద మే 17 నుంచి, నారాయణపూర్, కొండగావ్ DRG సిబ్బందిని ఓర్చా వైపు మోహరించడం ప్రారంభించారు. 18వ తేదీన, దంతెవాడ, బీజాపూర్, బస్తర్ ఫైటర్స్ నుంచి DRG సైనికులు లోపలికి వెళ్లారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు వారు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. ఆపరేషన్‌కు ఒక రోజు ముందు, 17వ తేదీన, ఆ యూనిట్‌లోని ఒక PPC సభ్యుడు తన భార్యతో పారిపోయాడు. ఈ వ్యక్తులు సమాచారం పొందడానికి ఎక్కడికి వెళ్లారు? ఈ వ్యక్తులు పారిపోయిన తర్వాత, శిబిరాన్ని అక్కడి నుంచి తరలించారు. 19వ తేదీ ఉదయం, పోలీసు బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకున్నాయని సమాచారం అందిన తర్వాత, వారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మార్గమధ్యలో పోలీసు సిబ్బందితో మొదటి ఎన్‌కౌంటర్ ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ తర్వాత, రోజంతా 5 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఎవరికీ హాని జరగలేదు. చుట్టుముట్టిన ప్రాంతం నుంచి బయటపడటానికి వారు 20వ తేదీన రోజంతా ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. రాత్రిపూట 20 వేల మంది పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 21వ తేదీ ఉదయం ఫైనల్ ఆపరేషన్ నిర్వహించారు. 

ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో అమర్చిన వేలాది మంది గూండాలు ఉన్నారు, ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం, నీరు కోసం హెలికాప్టర్ల ద్వారా ఇచ్చారు. దేశంలోని సామాజిక, ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రజలకు 60 గంటలు తినడానికి లేదా తాగడానికి ఏమీ దొరకలేదు. వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మా సహచరులు బిఆర్ దాదాను తమ మధ్య సురక్షితమైన స్థలంలో ఉంచేందుకు ప్రతిఘటించారు. DRG కి చెందిన కోట్లూ రామ్ మొదటి రౌండ్‌లోనే చనిపోయాడు. దీని తరువాత ముందుకు నేను రావడానికి ధైర్యం చేయలేదు. అనంతరం మళ్లీ కాల్పులు ప్రారంభించారు. ఆ టైంలో మొదటి వ్యక్తి కమాండర్ చందన్ చనిపోయాడు. అయినా, అందరూ చివరి వరకు ధైర్యంగా ప్రతిఘటించారు.చాలా మంది సైనికులను గాయపరిచారు. 

ఒక బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించగలిగింది. కానీ భారీ షెల్లింగ్ కారణంగా మిగిలిన వారు ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు. నాయకుడిని కాపాడే బాధ్యతను అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ, చివరి వరకు దాదాకు చిన్న గీత దెబ్బ కూడా తగలనివ్వలేదు. అందరూ అమరవీరులైన తర్వాత, కామ్రేడ్ బిఆర్ దాదాను సజీవంగా పట్టుకుని చంపారు. మా సహచరులు 35 మంది ఉన్నారు. వారిలో 28 మంది అమరవీరులయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమరవీరుల జాబితా భిన్నంగా ఉంటుంది. కామ్రేడ్ నీలేష్ మృతదేహాన్ని PLGA గుర్తించింది. పోలీసు దళం ఘమాండి నుంచి తిరిగి వస్తుండగా, కొన్ని సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో LOS కమాండర్‌గా పనిచేసిన రమేష్ హేమ్లా అనే మరో జవాన్ ఇంద్రావతి నది ఒడ్డున జరిగిన IED పేలుడులో మరణించాడు."అని ఆ రోజు ఆపరేషన్ ఎలా జరిగిందే వివరించారు. 

కాల్పులు విరమణ  తమవైపు నుంచి ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్ బిఆర్ దాదా సూచన మేరకు ప్రభుత్వ సాయుధ దళాల చర్యలు ఆపివేసి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారన్నారు. 40 రోజుల్లో ఒక్క ప్రతిఘటన కూడా జరగలేదన్నారు. ఈ సమయంలో ఒక కుట్ర ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద దాడి నిర్వహించాయని ఆరోపించారు. దీని గురించి ఒక్క మీడియా కూడా ప్రశ్నించడం లేదని అన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. 

ప్రధాన నాయకత్వం భద్రత విషయంలో పార్టీ ఏం చేసిందనే ప్రశ్నలు అందరి మనసులో తలెత్తడం సాధారణ విషయమేనన్నారు మావోయిస్తులు. ఇందులో తాము విఫలమైనట్టు పేర్కొన్నారు. జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య 60 కంటే ఎక్కువగానే ఉందని ప్రతికూల పరిస్థితుల్లో సులభంగా కదలడానికి వీలుగా సంఖ్యను తగ్గించారన్నారు. ఈలోపు కొందరు లొంగిపోవడం  ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. ఏప్రిల్, మేలో పెద్ద ప్రచారాలు వస్తాయని ఎదురుచూశామన్నారు. కానీ కామ్రేడ్ బసవరాజ్ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధ పడలేదని గుర్తు చేశారు. భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పుడు మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను ఈ బాధ్యతను గరిష్టంగా రెండు లేదా మూడు సంవత్సరాలు నిర్వహించగలను. యువ నాయకత్వ భద్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించినట్టు లేఖలో తెలిపారు. బలిదానాలు ఉద్యమాన్ని బలహీనపరచదు, బలిదానాలు వ్యర్థం కాదు, చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో బలిదానాలు విప్లవాత్మక ఉద్యమానికి బలాన్ని ఇచ్చాయని తెలిపారు. 

ఈ అమరవీరుల ప్రేరణతో, విప్లవ ఉద్యమం అనేక రెట్లు ఎక్కువ శక్తితో ఉద్భవిస్తుందని నమ్ముతున్నానమని అభిప్రాయపడ్డారు. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం దుష్ట ప్రణాళికలు నిజం కావని అన్నారు. "మా సహచరులు చాలా మంది అతనిని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, దాదా వినలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కార్యకర్తలతో కలిసి ఉండి, దగ్గరి మార్గదర్శకత్వం అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అని వివరించారు. 

ఉద్యమం, నాయకత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, మీడియా వ్యక్తులను ప్రశ్నలు సంధించారు మావోయిస్టులు. నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలన్నారు.  నిజమైన విప్లవకారులు ఎప్పటికీ భయపడరని, దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నామన్నారు.  ప్రభుత్వం, విప్లవ వ్యతిరేకులు దీన్ని విజయంగా అభివర్ణిస్తున్నారని, వారికి ఒక పెద్ద విజయమని మేము నమ్ముతున్నామన్నారు. కార్పొరేట్ హిందూ దేశాన్ని నిర్మించాలనే వారి ప్రణాళికను అమలు చేసే దిశలో ఇది కచ్చితంగా ఒక విజయమన్నారు. 

నవ భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రణాళికతో విభేదించే కోట్ల మంది ప్రజలు ఈ నష్టం గురించి ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇది భారత విప్లవ ఉద్యమానికి భారీ నష్టంగా అభివర్ణించారు. మే 21 చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బలమైన శత్రువును ఎదుర్కొన్నప్పుడు విప్లవ ఉద్యమాలు అలాంటి నష్టాలను చవిచూసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఉద్యమం కామ్రేడ్ బసవరాజు బలమైన భావజాలం, దీర్ఘకాల సహకారంపై నిర్మించిందని వివరించారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే బలమైన కార్యకర్తలు అభివృద్ధి చెందారని, అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటీ ఉందని ప్రకటించారు. 

ప్రతికూల పరిస్థితి నుంచి విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయని చెప్పారు. ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోందన్నారు. ఇది మాత్రమే కాదు, సామ్రాజ్యవాదుల నుంచి కూడా సహాయం పొందుతోందని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలు, నియమాలు ఉల్లంఘిస్తూ, దేశంలో సైన్యాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఫిరంగిదళాలు,  ట్యాంకులను ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం  చేశారు. సాయుధ విప్లవకారులను భౌతికంగా నిర్మూలించడంలో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చు కానీ విప్లవాత్మక ఆలోచనలను తొలగించడం సాధ్యం కాదన్నారు.  

కాగర్ పేరుతో జరుగుతున్న ఈ ఊచకోత వెనుక ప్రభుత్వం  నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని, మన దేశాన్ని, దాని సంపదను, పర్యావరణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను త్యాగం చేసే నిజమైన దేశభక్తుల భావజాలం,  రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని, ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితం అవ్వాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులు కలిసి ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్ DGMO ఆదేశాలతో కాల్పుల విరమణ ఎలా అమల్లోకి వచ్చిందని ప్రశ్నించారు. దేశంలోని ప్రజాస్వామ్య, విప్లవాత్మక ప్రజలు శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కరించడానికి కాల్పుల విరమణ చేపట్టాలన్న విజ్ఞప్తులు వినడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను,  విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళికను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ అంశంపై మోదీ నోరు మూయించిన శక్తి ఏదని ప్రశ్నించారు. దేశంలో దేని విజయం కోసం తిరంగ యాత్ర నిర్వహిస్తారని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాదా అని క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పడం అంటే మనం పాకిస్తాన్‌తో యుద్ధం కోరుకుంటున్నామని కాదన్నారు. దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు, పెద్ద కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడల్లా ప్రజల కోసం అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటామన్నారు.