Nambala Kesava Rao :   మోస్ట్-వాంటెడ్ నక్సల్  నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టు తిరుగుబాటుపై జరిగిన అత్యంత నిర్ణయాత్మక దాడులలో ఇది ఒకటి అనుకోవచ్చు.   భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని దట్టమైన అబుజ్‌మద్ అడవులలో  జరిపిన ఆపరేషన్ లో  నక్సల్ సుప్రీం కమాండర్ అయిన నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజును చంపేశాయి. 

బసవరాజు తలకు కోటిన్నర వెల

బసవరాజు తలకు కేంద్రం కోటిన్నర వెల కట్టింది.   యొక్క మోస్ట్-వాంటెడ్ నక్సలైట్, భారత దళాలపై జరిగిన కొన్ని ప్రాణాంతక దాడుల వెనుక సైద్ధాంతిక  వ్యూహాకర్త బసవరాజు. ఇతన్ని ఎన్ కౌంటర్ చేయడం మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మోపడంలో కీలకమైన ముందడుగు అనుకోవచ్చు.   ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట గ్రామానికి చెందిన బసవరాజు 1955లో ఒక  మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. తన స్వగ్రామంలో సమీపంలోని తలగం (టెక్కలి రెవెన్యూ బ్లాక్‌లోని అతని తాత గ్రామం)లో ప్రారంభ విద్య తర్వాత, అతను వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల (ఇప్పుడు NIT)లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు.  అక్కడే   రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ , తరువాత CPI (ML) పీపుల్స్ వార్ ద్వారా రాడికల్ రాజకీయాల్లోకి ఆకర్షితుడయ్యాడు. మావోయిస్టు లక్ష్యానికి పూర్తిగా కట్టుబడి ఉండటానికి 1984లో అతను తన M.Techను మధ్యలో వదులుకున్నాడు .   మెరుపు దాడులకు మారు పేరు సంబాల 

మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అగ్రనేత సంబాల కేశవరావు. ఇతను సైనిక వ్యూహకర్తగా పార్టీలో పేరు ఉంది. పీఎల్‌జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మిలటరీ విభాగానికి నాయకత్వం వహించి భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడ్డారు. గెరిల్లా వ్యూహాలను అమలు చేయడంలో అత్యంత నైపుణ్యం ఉన్న నాయకుడిగా పేరు. పేలుడు పదార్థాల నిపుణిడిగా పార్టీ ఆయన్ను గుర్తించింది. సంబాల కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయుధ వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగిన కీలక నేత. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర,, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జరిగిన అనేక గెరిల్లా దాడుల్లో సంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు చెబుతారు. ఆపరేషన్ కగార్ టార్గెట్‌లో ఉన్న అగ్రనేత .

 దంతేవాడ దాడి ప్రధాన సూత్రధారి సంబాల కేశవరావు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు చేసిన దాడి దేశ చరిత్రలోనే ఘోరమైన దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన సీఆర్పీఎఫ్‌కు చెందిన 75 మంది పోలీసులు, ఒక స్థానిక పోలీసుతో కలిసి కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు అంబుష్ వేసి దాడి చేశారు. తుపాకులతో కాల్పులు, గ్రెనెడ్లు, ఐఈడీలను పేల్చి సీఆర్పీఎఫ్ దళాలపై మావోలు విరుచుకుపడ్డారు. దీంతో 76 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో 300 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ దాడుల సూత్రధారి సంబాల కేశవరావేనని పోలీసులు తెల్చిచెప్పారు.

 రాజకీయ నాయుకులే లక్ష్యంగా జరిగిన అతి పెద్ద దాడి జీరంఘాట్ దాడి

జీరం ఘాట్ దాడి మే 25, 2013న జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జీరం ఘాట్‌లో మావోయిస్టులు జరిపిన దాడుల్లో 27 మంది మరణించారు. ఇది చాలా కీలకమైన దాడిగా చెబుతారు. రాజకీయ నాయకులు టార్గెట్‌గా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దర్బలోయలో జీరం ఘాట్ వద్ద జగదల్పూర్ - సుక్మా హైవేపై ఈ దాడి జరిగింది. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బస్తర్ ఏరియాలో పరివర్తన యాత్ర నిర్వహించింది. సుక్మా జిల్లా నక్సల్స్ అత్యంత ప్రభావితం చూపే ప్రాంతం. ఓ రకంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటించిన రెడ్ కారిడార్ ప్రాంతంగా చెప్పవచ్చు. పరివర్తన యాత్రలో పాల్గొన్న చత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా మావోయిస్టులు అంబుష్ వ్యూహాన్ని అమలు చేశారు. ఏకే 47, ఇన్సాస్ రైఫిల్స్, గ్రెనెడ్లు, ఐఈడీ, ఆటోమెటిక్ ఆయుధాలతో కాంగ్రెస్ నేతల వాహన శ్రేణిపై ఆకస్మిక దాడి జరిపారు. దాదాపు 200 మంది మావోయిస్టులు ఇందులో పాల్గొన్నారు. ఈ దాడిలో 27 మంది మరణించారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మ ఈ దాడిలో మరణించారు. మావోలకు వ్యతిరేకంగా ప్రత్యేక దళం సల్వాజుడుంను రూపొందించి ఉద్యమం నడిపిన వ్యక్తి మహేంద్ర కర్మ. ఆయనతోపాటు ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు నందకూమర్ పటేల్, ఆతని కుమారుడు దినేశ్ పటేల్‌, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ మద్లియార్, దాదాపు 10 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీనికి మాస్టర్ మైండ్ సంబాల కేశవరావేనని పోలీసులు చెబుతున్నారు.

  2019లో గడ్చిరోలి ప్రతీకార దాడికి సూత్రధారి

మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఐఈడీ బాంబు దాడిలో 15 మంది సీ -60 కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు ఒక సామాన్య పౌరుడు చనిపోయారు. ఈ దాడి 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికల వేళ మావోయిస్టులు తన ఉనికిని చాటుకోవడం కోసం చేసినట్లు పోలీసులు భావించారు. అంతేకాకుండా 2018లో గడ్చిరోలి లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంతో ఈ దాడి చేసినట్లు మావోయిస్టులు చెప్పారు. 2019 మే 1వ తేదీన రాత్రి దాదాపూర్ గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 30కుపైగా వాహనాలను తగులబెట్టారు. ఈ సమాచారంతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లోని 15 మంది సీ-60 కమాండోలు స్థానిక డ్రైవర్‌తో కలిసి పురాడా పోలీస్ స్టేషన్ నుంచి వాహనంలో వెళ్తుండగా లెందరీ నుల్లా అనే ప్రాంతం వద్ద ఉన్న కల్వర్ట్ కింద ఐఈడీలు పేల్చారు. దీంతో డ్రైవర్ సహా 16 మంది మరణించారు. 30-40 కిలోల ఆర్డీఎక్స్ వాడినట్లు తెలిసింది. ఈ దాడిలో టిప్పగడ్, దేవ్రీ, పెర్మిలీ, అహేరీ, కేకడి, ఎటపల్లి దళాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడి వ్యూహకర్త సంబాల కేశవరావుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 హిడ్మా ఉచ్చులోకి లాగి 2021లో బీజాపూర్ - సుక్మా దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- బీజాపూర్ సరిహద్దు ప్రాంతం జోనాగుడ గ్రామ సమీపంలో ఏప్రిల్ 3, 2021లో మావోయిస్టులు భద్రతాబలగాలపై దాడి చేశారు. ఇందులో 22 మంది పోలీసులు మరణించగా 31 మంది గాయపడ్డారు. భద్రతా దళాల చరిత్రలో ఈ దాడి ఘోరమైన దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ బస్తర్ అడవుల్లో సుక్మా- బీజాపూర్ సరిహద్దు, జోనాగూడ గ్రామ సమీపంలోని జగర్ గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాడి జరిగింది. 2021 ఏప్రిల్ 2వ తేదీ రాత్రి సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, 2000 మంది కూంబింగ్‌లో పాల్గొన్నారు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ హిడ్మా సెర్చింగ్ ఆపరేషన్ ఇది. ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే భద్రతా బలగాల ఉనికిని ముందాగానే పసిగట్టిన మావోయిస్టులు హిడ్మా సమాచారాన్నే తమ దాడికి ఉపయోగించుకుని విరుచుకుపడ్డారు. దాదాపు 400మంది మావోయిస్టులు 3 వైపుల నుంచి ఈ పోలీసు బలాగలను చుట్టుముట్టాయి. ఎల్‌ఎంజీ, రాకెట్ లాంచర్లు, ఐఈడీలతో వారిపై ముప్పేట దాడికి దిగారు. నాలుగు గంటలపాటు భీకరంగా పరస్పర దాడులు జరిగాయి. మూడు వైపులా మావోయిస్టులు ఉండటంతో భద్రతా బలగాలు తప్పించుకునే మార్గం లేని పరిస్థితి. ఈ దాడిలో 22 మంది మరణించగా, 31 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడి అంతా పక్కా ప్లాన్‌తో హిడ్మా ఇన్‌ఫర్మేషన్‌తో ప్రణాళికా బద్దంగా పోలీసులను ఉచ్చులోకి లాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దాడిలో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులుచెబుతున్నారు. మరణించినమావోలను, గాయపడిన వారిని నాలుగు ట్రాక్టర్లలో మావోయిస్టులు తీసుకెళ్లినట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం సూత్రధారి సంబాల కేశవరావేనని పోలీసులు చెబుతున్నారు.  2003 లో చంద్రబాబుపై దాడి 

తిరుపతి సమీపంలోని అలిపిరి ఘాట్ రోడ్డు, వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో 2003 అక్టోబర్ 1వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పై మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన క్లెమోర్ మైన్‌లు రిమోట్ ద్వారా పేల్చి దాడికి పాల్పడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబు భుజం, కాలుకు గాయాలయ్యాయి. కాన్వాయ్‌లోని పోలీసులు, దగ్గర్లో ఉన్న ప్రజలు గాయపడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి సంబాల కేశవరావని పోలీసులు నిర్థారించారు. ఏకంగా సీఎంపైనే ఈ దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఎంతో భద్రత ఉండే వీఐపీ వాహణ శ్రేణిపై జరిపిన ఈ దాడితో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ దాడి తర్వాత దేశంలో వీఐపీ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబుకు జెడ్ ప్లక్ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేశఆరు.  

చర్చలు కోరుతున్న మావోయిస్టులు

ఎన్ కౌంటర్ పై ఛత్తీస్‌గఢ్ DGP అరుణ్ దేవ్ గౌతమ్ అ ప్రెస్ బ్రీఫింగ్‌కు కొద్దిసేపటి ముందు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు , ప్రతినిధి అభయ్ 26 మంది మావోయిస్టులు చనిపోయిన విషాయన్ని అంగీకరిస్త ,శాంతి చర్చలకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. చర్చలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.   2014 నుండి, భద్రతా దళాలు సమగ్ర శిక్షణ, మెరుగైన సాంకేతికత, ఉమ్మడి కార్యకలాపాలతో  నక్సల్స్ ను టార్గెట్ చేశాయి.   అధికారిక గణాంకాల ప్రకారం మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 2014లో 76 నుండి 2024లో 42కి తగ్గాయి. భద్రతా సిబ్బందిలో మరణాలు గణనీయంగా తగ్గాయి - 2014లో 88 నుండి 2024లో 19కి తగ్గాయి.   మావోయిస్టుల లొంగుబాటు పెరుగుతోంది, 2024లో 928 మరియు 2025లో ఇప్పటికే 700 కంటే ఎక్కువ. ఎన్‌కౌంటర్లు తీవ్రమయ్యాయి, 2025 మొదటి నాలుగు నెలల్లోనే 197 మంది మావోయిస్టులు హతమయ్యారు.  

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  సమాంతర అభివృద్ధి ప్రయత్నాలు జరుగుతున్నాయి, LWE ప్రభావిత ప్రాంతాల్లో 320కి పైగా భద్రతా శిబిరాలు మరియు 68 నైట్-ల్యాండింగ్ హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు.   రోడ్లు, పాఠశాలలు ,  మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు గతంలో ప్రవేశించలేని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి.  మావోయిస్టు కమాండ్ నిర్మాణం ఇప్పుడు విచ్ఛిన్నమైందని, మనుగడలో ఉన్న నాయకులు చిన్న చిన్న సమూహాలలో పనిచేస్తున్నారని చెబుతున్నారు. 2026 నాటికి మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా చేసుకుని, 2025 చివరి నాటికి మిగిలిన నాయకత్వాన్ని నిర్మూలించడం లేదా బలవంతంగా లొంగిపోవాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉన్నతాధికారుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆపరేషన్ కేవలం వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు - ఇది ఒక మానసిక మలుపు.