Kandula Durgesh About Allu Aravind Comments: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల పరిణామాలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' టైంలోనే థియేటర్స్ బంద్ వ్యవహారం తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. పవన్ సినిమాను ఆపడం దుస్సాహసమే అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.
ఇండస్ట్రీలో కొందరు అహంకారంతో..
అల్లు అరవింద్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నామని.. ప్రస్తుతానికి బంద్ నిర్ణయం వెనక్కు తీసుకున్నందున ఈ సమస్య సమసిపోయినట్లేనని మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై కొంత కార్యాచరణ అవసరమని అన్నారు. 'కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలతో ఇండస్ట్రీకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం. టికెట్ రేట్ల పెంపు, షూటింగ్ అనుమతులు వెంటనే ఇస్తున్నాం. సినీ ప్రముఖులు కలవలేదని మేము ఎప్పుడూ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు.
ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. మాకు ఎవరి సహకారం అవసరం లేదు మేమే చూసుకుంటాం అనే మాటలు అహంకార పూరితం అనిపిస్తోంది. ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో నాకు తెలీదు. సినీ పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో స్టార్ హీరోలను రప్పించి అవమానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.' అని మంత్రి చెప్పారు.
Also Read: అందరూ నిన్ను మోసం చేశారు.. నేను మాత్రం.. - ఇంట్రెస్టింగ్‌గా అడివి శేష్ 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్
ఆయనకు మానవత్వం ఉందా?
పవన్ కల్యాణ్ మూవీ ప్లాప్ అంటూ వైసీపీ మాజీ మంత్రి చేసిన కామెంట్స్‌పై మంత్రి కందుల ఫైరయ్యారు. 'గత ప్రభుత్వం సినిమా వాళ్లను ఎంత అవమానించిందో అందరికీ తెలుసు. 'సినిమా అనేది వ్యాపారమని.. వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు.' అని అంటున్నారు. అప్పుడు మీరు చేసిన నిర్వాకాలు అందరికీ తెలుసు. సినిమాకు సంబంధించి విషయాల్లో ప్రభుత్వ సహకారం ఏదో ఒక స్థాయిలో కచ్చితంగా ఉంటుంది.
ఓ పోరాట యోధుడి కథతో రూపొందిన సినిమా 'ఫ్లాప్ మూవీ' అంటున్నారు. ఆ వైసీపీ మాజీ మంత్రి కామెంట్స్ చూస్తుంటే అసలు ఆయనకు మానవత్వం ఉందా? అనిపిస్తుంది. సినిమా రిలీజ్ కాకముందే స్టేట్మెంట్ ఇచ్చారంటే.. ఆయన ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నాడో అర్థమవుతోంది. బాధ్యత కలిగిన మంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా?. ఇలాంటి వారే 'జంతు సమాన.. మూర్ఖత్వానికి నమూనా..' అని జంధ్యాల గారు ఎప్పుడో చెప్పారు. ప్రజలందరూ మీ చర్యలను గమనిస్తున్నారు.' అని కందుల అన్నారు.
ఇండస్ట్రీ అభివృద్ధికి పాలసీ
సినీ రంగానికి సహకరిస్తున్నప్పుడు వారు వచ్చి కలిస్తే సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కలవడం, కలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేశామని కందుల దుర్గేశ్ అన్నారు. 'ఇండస్ట్రీకి ఒక పాలసీ తీసుకొద్దామని అంటున్నాం. ఎగ్జిబిటర్లు, థియేటర్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఓ పాలసీ తీసుకొస్తామని చెబుతున్నాం. అలాగే మల్టీప్లెక్స్‌లో టికెట్, స్నాక్స్ ధరలపైనా విధి విధానాలు రూపొందించబోతున్నాం. దీనిపై విచారణకు ఆదేశించాం. నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటాం.' అని మంత్రి చెప్పారు.