Manoj Manchu Reaction On Trollings: సినిమా మాకు అమ్మలాంటిదని దయచేసి దానికి కులాలు, గోత్రాలు తీసుకురావొద్దని మంచు మనోజ్ అన్నారు. ఆదివారం నిర్వహించిన 'భైరవం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్స్‌పై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు కలిసి ఓ సినిమా చేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయని.. ఇది చాలా బాధాకరమని అన్నారు.

మా కులం సినిమా..

సినిమా ఓ కులానిది కాదని.. సినీ కళామతల్లి కులం, గోత్రం చూడదని మనోజ్ అన్నారు. 'మా కులం సినిమా.. మా గుడి సినిమా థియేటర్. సినిమ టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, హిందు సినిమానా?, క్రిస్టియన్ సినిమానా?, అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా లవర్స్ ఎక్కడ టాలెంట్ ఉన్నా నెత్తిన పెట్టుకుంటాం. అంత గొప్ప ఇండస్ట్రీ మనది.

కులం, మతం, బ్యాక్ గ్రౌండ్ ఏమీ చూడకుండా కేవలం ఆర్టిస్టుల మీదే ఖర్చు పెట్టేవారు మన నిర్మాతలు. సినిమా మాకు అమ్మలాంటిది. కొడుకు కూతురులను వేర్వేరుగా చూడదు. దయచేసి కులాలు గోత్రాలు మా ఇండస్ట్రీలోకి తీసుకురావొద్దు.' అంటూ రిక్వెస్ట్ చేశారు.

Also Read: నెల రోజుల్లోపే ఓటీటీలోకి సూర్య లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెట్రో' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

అలా జరిగుంటే సారీ

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కనకమేడలపై ఇటీవల జరిగిన ట్రోలింగ్, బాయ్ కాట్ ట్రెండ్‌పైనా మనోజ్ స్పందించారు. డైరెక్టర్ విజయ్ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని.. పదిమందికి సేవ చేస్తూ ఉంటారని అన్నారు. 'ఇటీవల మా సినిమా విషయంలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. విజయ్ ఏదో పోస్టు పెట్టారని కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియకపోయినా ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు ఆయన వీరాభిమాని. అందరూ ఒక్కటై.. మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.

మెగా అభిమానులే విమర్శిస్తుంటే విజయ్ తట్టుకోలేకపోతున్నారు. ఆయన్ను అలా చూడలేకపోతున్నా. ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నా. పోస్ట్ విషయంలో ఎవరైనా ఇబ్బంది ఫీల్ అయితే మా టీం తరఫున అందరికీ సారీ చెబుతున్నా. ఎంతోమంది శ్రమతో కూడింది సినిమా. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నేను నటించిన సినిమా. అందరూ ఆశీర్వదించండి.' అని అన్నారు.

ఫోన్ చేసి రూ.10 వేలు అడిగారా?

మీరు ఎవరికైనా ఫోన్ చేసి రూ.10 వేలు అడిగితే.. ఎంతగా ఆలోచిస్తారో అందరికీ తెలిసిందేనని మనోజ్ అన్నారు. లాభం వస్తుందా? రాదా? అనేది ప్రొడ్యూసర్స్ చూడరని.. టాలెంట్ కష్టాన్ని చూసీ హీరోలపై డబ్బు పెడుతుంటారని తెలిపారు. 'నిర్మాత రాధామోహన్ మా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది చూడలేదు. మా ముగ్గురిని నమ్మి ఆయన సినిమా నిర్మించారు. సినీ కళామతల్లి ముందు మేమంతా సమానం. దయచేసి సామాజిక వర్గాల ప్రస్తావన మా ఇండస్ట్రీలోకి తీసుకురాకండి.' అని మనోజ్ పేర్కొన్నారు.

శింబుతో సరదా సంభాషణ

ఈ సందర్భంగా తమిళ స్టార్ శింబుకు కాల్ చేసిన మనోజ్ సరదాగా మాట్లాడారు. 'కమల్ హాసన్‌తో నటించావు. నిన్ను చూస్తే జలసీగా ఉంది. థగ్ లైఫ్‌కు ఆల్ ది బెస్ట్ మచ్చా' అంటూ చెప్పగా.. 'మనోజ్ చిన్నపిల్లలాంటి వాడు. మనం ప్రేమిస్తే తిరిగి అంతకుమించి ప్రేమను చూపిస్తాడు. అదే ద్వేషిస్తే అతనితో మనకే రిస్క్. మనోజ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.' అంటూ శింబు రిప్లై ఇచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.