Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టించాయి. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలతో పాటు ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోయాయి. అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో కొంత మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కశ్మీర్ లో ఉగ్రకదలికలపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, 5 హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.


భద్రతా సిబ్బంది మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా.. అందులో యాసిర్ అహ్మద్ షా అనే యాక్టివ్ టెర్రరిస్టు కూడా ఉన్నాడు. మిగతా ఐదుగురు అతడికి సహాయం చేస్తున్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ ఐదుగురు సహాయకారుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు బారాముల్లా సీనియర్ ఎస్పీ అమోక్ నాగ్ పురే తెలిపారు. తాజా అరెస్టుల కారణంగా జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగినట్లు ఎస్పీ వెల్లడించారు. సరిహద్దు నుంచి అక్రమ ఆయుధాల దిగుమతికి అడ్డుకట్ట వేశామని వెల్లడించారు. 


యాసిర్ అహ్మద్ షా అరెస్టు తర్వాతే.. అతడికి సహాయం చేస్తున్న వ్యక్తుల సమాచారం కూడా తెలిసిందని చెప్పారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే తన సహాయకుల్లో మహిళలతో పాటు మైనర్ కూడా ఉంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటే మహిళలు, మైనర్లు అనే తేడా చూడమని ఘాటుగా హెచ్చరించారు.


కొన్ని రోజుల క్రితం అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ దాడుల్లో నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మృతుల్లో ముగ్గురు అధికారులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్ లో భద్రతాబలగాలు అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై  దృష్టి సారించాయి. పలు చోట్ల గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో అక్కడి భద్రతను సమీక్షించేందుకు సోమవారం ఓ కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. పోలీసు, ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇందులో ఉన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై వారు చర్చించారు.


లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల మృతితో జవాన్లు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నారు.భారీగా బలగాలను అనంతనాగ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే పలుసార్లు కాల్పులు, బాంబు పేలుళ్లు వినిపించాయి. అనంతనాగ్‌లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై వివరాలు వెల్లడించలేదు. ఉగ్రదవాదులను కనిపెట్టేందుకు పోలీసులు అనంతనాగ్‌ ప్రాంతంలో అధిక సర్వైలెన్స్‌ కెపాసిటీ ఉన్న హెరోన్‌ డ్రోన్లను ఉపయోగించారు. అత్యాధునిక పరికరాలను, నైట్‌ విజన్‌ డివైజెస్‌ను కూడా వాడుతున్నారు.