Record Temparature In Ooty: హాట్ సమ్మర్ లో ఊటీ (Ooty), కొడైకెనాల్ వంటి కూల్ ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వెళ్తుంటారు. వేసతి తాపం నుంచి ఉపశమనం పొంది అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే, వేసవి విడిది కేంద్రమైన ఊటీలోనూ ఈ ఏడాది ఎండలు కాస్త ఎక్కువయ్యాయి. 38 ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ హిల్ స్టేషన్ లో ఏప్రిల్ 29న 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని ప్రాంతీయ వాతావరణ అధికారి పేర్కొన్నారు. అలాగే, మే 1వ తేదన సైతం సాధారణం కంటే 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. 1986, ఏప్రిల్ 29న 28.5 డిగ్రీల నమోదైందని.. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. అయితే, రాత్రి వేళల్లో మాత్రం ఇక్కడ వాతావరణం చల్లగానే ఉంటుందని పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా..


మరోవైపు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. సాధారణం కంటే 4 - 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. కాగా, పశ్చిమబెంగాల్ లోని కలైకుండలో గరిష్టంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. తమిళనాడు, మహారాష్ట్రల్లోని కూల్ ప్రాంతాల్లోనూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తమిళనాడు ఊటీలో 29.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. మహారాష్ట్రలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ మాథేరన్ లోనూ 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాథేరన్ లో నమోదైన నాల్గో అధిక ఉష్ణోగ్రత ఇది. ముంబైకి 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ లో 1979, ఫిబ్రవరి 6న 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఏపీ, తెలంగాణ సహా ఒడిశా, పశ్చిమబెంగాల్ లోని పట్టణాల్లోనూ కొన్ని చోట్ల 44 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 


Also Read: Rahul Gandhi And Kishori Lal Sharma : రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌- అమేథీ నుంచి న్యూ ఫేస్‌- కాంగ్రెస్ జాబితాలో ట్విస్ట్- ఇంతకీ ఎవరీ కేఎల్‌ శర్మ ?