Rahul Gandhi About His Marriage | పాట్నా: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బిహార్‌‌లో చేపట్టిన ఓటర్ల హక్కుల యాత్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ చేపట్టిన ఓటర్ల హక్కుల యాత్ర ఆదివారం నాడు అరారియాకు చేరుకుంది. ఇక్కడ రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మీడియా  సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) గురించి మాట్లాడుతూ, "అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఒకరికి హనుమంతుడు లాంటివారు. మేం మాత్రం ప్రజలకు సేవ చేసే హనుమంతులం’ అన్నారు..

చిరాగ్ పాశ్వాన్ పెళ్లి గురించి తేజస్వి ఏమన్నారు?

తేజస్వి యాదవ్ ఇంకా మాట్లాడుతూ, "చిరాగ్ పాశ్వాన్ నాకు పెద్దన్న లాంటివాడు. నేను ఆయనకు ఓ సలహా ఇస్తాను. నా బిగ్ బ్రదర్ చిరాగ్ పాశ్వాన్ త్వరలో పెళ్లిచేసుకోవాలి. ఇదే తామంతా కోరుకుంటున్నాం" అని అన్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న తేజస్వి యాదవ్‌ మాటలకు  రాహుల్ గాంధీ ఫన్నీగా స్పందించారు. తేజస్వీని చూస్తూ "ఇది (పెళ్లిచేసుకోవడం) నాకు కూడా వర్తిస్తుందని రాహుల్ గాంధీ అనడంతో అక్కడ అంతా నవ్వారు.  

బిహార్‌లో వివాదానికి కారణమైన ఎస్ఐఆర్ గురించి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. "ఓట్ల సవరణ ప్రక్రియ చాలా కష్టంగా ఉంది, ఓట్లు కలపడం లేదా ఫిర్యాదు చేయడం ద్వారా తొలగించడంపై ఇంకా SIRపై స్పష్టత లేదు. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఉంది, కాబట్టి బీజేపీ ఎలక్షన్ కమిషనర్లను రక్షించడానికి పార్లమెంటులో చట్టాన్ని సైతం తీసుకువచ్చింది. తద్వారా వారిపై ఎలాంటి చర్యలు, కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని చూస్తున్నారు. వారు చట్టంతో ఎలా ఆడుకుంటున్నారో అందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు విషయం ప్రజలకు చేరింది, రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధిచెబుతారు"

అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి - రాహుల్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మా మధ్య చాలా మంచి భాగస్వామ్యం ఉంది. మా కూటమిలో అంతా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాలో ఎవరిపై ఎటువంటి ఒత్తిడి లేదు, ఒకరంటే మరొకరికి పరస్పర గౌరవం ఉంది. మేము సైద్ధాంతికంగా, రాజకీయంగా ఐక్యంగా ఉన్నాం. బిహార్ ఎన్నికల్లో చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఓట్ల చోరీని ఆపాలి. అదొక్కటే మాకు సమస్యగా మారిందని" అన్నారు.