Tamilnadu News: భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాగా చదివించింది. అయితే అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్, కుమారుడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. అయితే కుమారుడి ఫీజు కట్టేందుకు మహిళ దగ్గర డబ్బులు లేవు. ఎవరిని అప్పు అడిగినా ఇవ్వలేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినా, అలా జరిగి చనిపోయినా సర్కారు డబ్బులు ఇస్తుందని.. అలాగే పిల్లలకు ఫ్రీగా చదువులు కూడా చెప్పిస్తుందని చెప్పారు. తను చనిపోతే పిల్లల భవిష్యత్తు అయినా బాగు పడుతుందని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ ఆలోచనతోనే వేగంగా వస్తున్న ఓ బస్సుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..?


తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన 39 ఏళ్ల పాపతి భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. అయితే ఈమెకు ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. కుమార్తె, కుమారుడితో కలిసి ఆమె స్థానికంగా నివాసం ఉంటోంది. స్థానిక కలెక్టర్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తాను ఎంత కష్టపడి అయినా సరే పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. అందుకోసమే దొరికిన పని చేసుకుంటూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రస్తుతం ఆమె కుమార్తె ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. కుమారుడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. కుమారుడికి కళాశాల ఫీజు కట్టేందుకు తన దగ్గర డబ్బులు లేవు. అయితే తెలిసిన వాళ్లను, స్నేహితులందరినీ పాపతి అప్పు అడిగింది. కానీ ఏ ఒక్కరూ సాయం చేయలేదు. అయితే తనకు తెలిసిన ఓ మనిషి ఓ తప్పుడు ఆలోచన చేసి ఆమెకు చెప్పింది. నీవు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వమే వారికి ఫ్రీగా చదువు చెప్పిస్తుందని వివరించింది. అమాయకురాలైన పాపతి అది నిజమనుకుని తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. తన చావుతోనైనా పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తుందని భావించింది. 



ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి మరీ ఢీకొంది. ఈ ఘటనలో పాపతి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.. ఈ ఘటనను ముందుగా అనుకోకుండా జరిగిన ప్రమాదంగా భావించారు. కానీ ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే తన తల్లిపై వస్తున్న వార్తలన్నీ అబద్ధం అని తన ఫీజు కట్టేందుకు బంధువులు సాయం చేశారని పాపతి కుమారుడు చెప్పాడు. మరోవైపు పోలీసుల దర్యాప్తులో మాత్రం ఓ మనిషి చెప్పిన మాటలు విన్న ఆమె కావాలనే ఆత్మహత్య చేసుకుందని వివరించారు.