Udhayanidhi Stalin : తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ను కేబినెట్ లోకి తీసుకోనున్నారు. కొన్నేళ్లుగా ఉదయనిధి డీఎంకే యువజన విభాగం బాధ్యతలు చేస్తున్నారు. పార్టీ చేబట్టిన కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రివర్గంలోకి తన కుమారుని తీసుకునేందుకు స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఏంకే నేతలు, కార్యకర్తల ఒత్తిడితో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉదయనిధికి క్రీడాభివృద్ధి, యువజన సంక్షేమ శాఖను అప్పగించవచ్చని సమాచారం. సీఎం స్టాలిన్ నిర్ణయంతో డీఏంకే శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 



14న ప్రమాణ స్వీకారం 


మంత్రివర్గంలోకి తన చేరికను ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఇంకా ధృవీకరించలేదు. కానీ రాజ్ భవన్ నుంచి ప్రెస్ రిలీజ్ పేరిట ఓ లేఖ వైరల్ అవుతోంది. ఇందులో సీఎం స్టాలిన్ ... ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ తీసుకునేందుకు గవర్నర్ కు సిఫార్సు చేసినట్లు ఉంది. అందుకు గవర్నర్ అంగీకారం తెలపడంతో ఉదయనిధి స్టాలిన్ డిసెంబర్ 14న మంత్రిగా ప్రమాణ  స్వీకారం చేయనున్నారని ప్రెస్ నోట్ లో ఉంది. డీఎంకే హై పవర్ కమిటీ నిర్ణయం మేరకు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 14న ఉదయనిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ఇటీవల మాండూస్ తుపానుకు గురైన తిరువళ్ళికెన్ తెరు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు బెడ్ షీట్లు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారు.  


తొలిసారి ఎమ్మెల్యే 


సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా 14వ తేదీన మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉంది. పార్టీలో తొలిసారిగా ఎమ్మెల్యేగా, యువజన విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ఉదయనిధి. అయితే విపక్షాలు మాత్రం కుటుంబ పాలన అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్, డీఎంకే యువజన విభాగం నాయకుడిగా ఉన్నారు. డిసెంబర్ 14న తమిళనాడు కేబినెట్‌లో కొందరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది. గత ఎన్నికల్లో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉదయనిధి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యువజన సంక్షేమం క్రీడల అభివృద్ధి శాఖలు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖలు ప్రస్తుతం మంత్రి శివ వి. మేయ్యనాథన్ చేతిలో ఉన్నాయి.  


మంత్రుల శాఖల్లో మార్పు 


సీఎం స్టాలిన్ కొందరి మంత్రులు పోర్ట్‌ఫోలియోలను మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సహకార మంత్రి ఐ. పెరియసామిని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తారని సమాచారం.  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెరియకరుప్పన్ ను సహకార మంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. అటవీ శాఖ మంత్రి కె. రామచంద్రన్‌ను తన శాఖ నుంచి తప్పించి, పర్యాటక శాఖ మంత్రిని చేయాలని భావిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ ఎం. మతివెంతన్‌ అటవీశాఖ మంత్రి అయ్యే అవకాశం ఉంది.