MK Stalin Vs Governor: 


గవర్నర్‌పై ఎమ్‌కే స్టాలిన్ వ్యాఖ్యలు..


తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ గవర్నర్ RN రవిపై (RN Ravi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గవర్నర్‌ని మార్చొద్దని తేల్చి చెప్పారు. చెన్నైలో ఓ పెళ్లికి హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షాపైనా విమర్శలు గుప్పించారు ఎమ్‌కే స్టాలిన్. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గవర్నర్‌ని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు. DMK ఎన్నికల ప్రచారానికి గవర్నర్‌ చాలా సహకరిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఆయన వల్ల తమ పార్టీకి ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. 


"ద్రవిడం అంటే ఏంటని పదేపదే గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రశ్నిస్తున్నారు. ఆయనను అలా ప్రశ్నించనివ్వండి. అదే మా ఎన్నికల ప్రచారానికి బలం. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆయనను మార్చాల్సిన పని లేదు. ప్రధాని మోదీ, అమిత్‌షాకి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి మా రాష్ట్ర గవర్నర్‌ని మార్చకండి. ఆయన నోటికొచ్చిందేదో మాట్లాడుతున్నారు. ప్రజలు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. బంగ్లాల్లో హాయిగా కూర్చునే వాళ్లు ఉన్నత పదవుల్లో ఉంటున్నారు. అవి ఎందుకూ పనికి రాని పదవులు. వాళ్లు ద్రవిడం గురించి మాట్లాడుతున్నారు"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


విభేదాలు..


చాలా రోజులుగా తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు (MK Stalin Vs RN Ravi) కొనసాగుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమేంటని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అటు గవర్నర్ కూడా అదే స్థాయిలో వాదిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు తన బాధ్యతలు నిర్వర్తించే అధికారం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఒకానొక సమయంలో అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేసిన ఘటన సంచలనమైంది. 


తమిళనాడు రాజ్‌భవన్‌ గేటుపై ఓ దుండగుడు పెట్రోల్ బాంబులు విసిరిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్ RN రవి (Governor RN Ravi) అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌పై ఇలా దాడి జరగడం వల్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం (అక్టోబర్ 25) 2.45 గంటలకు ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి పేరు కరుకా వినోద్‌గా గుర్తించారు. రెండు పెట్రోల్ బాంబులను రాజ్‌భవన్ మెయిన్‌ గేట్‌పై విసిరినట్టు తెలిపారు. ఓ కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైక్‌ల నుంచి పెట్రోల్ దొంగిలించాడు నిందితుడు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఓ బాటిల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి గేట్‌పైకి విసిరాడు. ఆ తరవాత మరో బాటిలి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడుని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 


Also Read: చంద్రయాన్ 3 పై ఇస్రో కీలక అప్‌డేట్, ల్యాండర్ దిగిన చోట 2 టన్నుల మట్టి చెల్లాచెదురు