Chandrayaan-3 Updates: 


ఇస్రో అప్‌డేట్..


చంద్రయాన్ 3 పై (Chandrayaan-3) ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న  2.06 టన్నుల మట్టిని చెల్లాచెదురు చేసినట్టు వెల్లడించింది. ల్యాండింగ్ అయిన క్రమంలో చంద్రుడి ఉపరితలంపై మట్టి పక్కకు జరిగినట్టు తెలిపింది. అక్కడ వాతావరణం ఏమీ ఉండదు కనుక ఆ మట్టి వేరే చోటకు వెళ్లే అవకాశముండదు. ఆ ల్యాండర్ దిగిన చోట మట్టి కాస్త కదిలింది. ఇది దాదాపు 108.4 చదరపు మీటర్ల మేర విస్తరించినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియనే టెక్నికల్‌గా ejecta halo అని పిలుస్తారు. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ విజయవంతంగా పూర్తైంది. ఆ తరవాత ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) సౌత్‌ పోల్‌పై దిగింది. ఆ పాయింట్‌కే భారత్ "శివశక్తి పాయింట్" (Shiva Shakti) అని పేరు పెట్టింది. అయితే...ఈ ఎజెక్టా హాలో ప్రక్రియను ఇస్రో క్యాప్చర్ చేసింది. ఇస్రోకి చెందిన National Remote Sensing Centre (NRSC) సైంటిస్ట్‌లు దీనిపై అధ్యయనం చేశారు. వీళ్లు చెప్పిన వివరాల ప్రకారం 2 టన్నులకుపైగా మట్టి ఉన్న చోట నుంచి కదిలి చెల్లాచెదురైంది. ప్రీ ల్యాండింగ్, పోస్ట్ ల్యాండింగ్‌కి సంబంధించిన ప్రతి డీటెయిల్‌నీ ఇస్రో వెల్లడిస్తోంది. ఇప్పటి వరకూ చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండర్‌ని సాఫ్ట్‌గా ల్యాండ్ చేసిన దేశం ఏదీ లేదు. భారత్ తొలిసారి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. 






చంద్రయాన్ 3 సక్సెస్‌కి ( Chandrayaan-3 Mission) గుర్తుగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా (National Space Day) అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషిని గౌరవిస్తూ ఈ ప్రకటన చేశారు. ఇటీవల అధికారికంగా అందుకు సంబంధించిన గెజిట్‌ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 మిషన్‌ విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ఉపరితలంపై సేఫ్‌గా ల్యాండ్ అయింది. ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపింది. ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయినా...రోవర్ పని పూర్తైందని, అది మేల్కోకపోయినా నష్టం ఏమీ లేదని ఇస్రో స్పష్టం చేసింది.