Viral News: ఛత్తీస్‌గడ్‌లో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. గాలిలో ఎగురుతూ కనిపించాడు. భక్తులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏంటి ఇదంతా నిజమేనా..? హనుమంతుడు నిజంగానే  ప్రత్యక్షమయ్యాడా..? అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అంతలేదు లేండి.. ఇది డ్రోన్‌ మహిమ. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఆంజనేయుడి భక్తులు చేసి చూపించిన క్రియేటివిటీ.  హనుమంతుడి ప్రతిమకు.. డ్రోన్‌ను కట్టి ఎగరేశారు. అది చూస్తే... ఆంజనేయుడే స్వయంగా ఆకాశంలో తిరుగుతున్నట్టు కనిపించింది. దీంతో భక్తులు కొంత విస్మయానికి  గురయ్యారు. హనుమంతుడి డ్రోన్‌ చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. 


ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా... సంబరాలను చిత్రీకరించేందుకు హనుమంతుడి ఆకారంలో ఉన్న డ్రోన్‌ వదిలారు  కొందరు. దసరా ఉత్సవాల కోసం అంబికాపూర్‌లోని కళాకేంద్ర మైదానం దగ్గర భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మహామాయ ఆలయం వరకు భారీ ఊరేగింపు జరిగింది.   ఈ ఊరేగింపును హనుమంతుడి డ్రోన్‌ సాయంతో చిత్రీకరించారు. అది చూసిన భక్తులంతా నిజంగా ఆంజనేయుడే వచ్చినట్టు ఫీలయ్యారు. ఆ డ్రోన్‌ను చూసేందుకు పోటెత్తారు.  డ్రోన్‌ విషయం తెలియని స్థానికులు.. నిజంగా హనుమంతుడే ఎగురుతున్నాడని అనుకుని నివ్వెరపోయారు. జై హనుమాన్‌ అంటూ నినాదాలు కూడా చేశారు.






హనుమంతుడి ఆకారంలో ఉన్నడ్రోన్‌ను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. హనుమంతుడి ఆకారంలో ఉన్న డ్రోన్‌ ఎగురవేయడం ఇది తొలిసారి కాదు. 2015లో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోనూ హనుమంతుడి డ్రోన్‌ను ఉపయోగించారు. అలాగే, గతంలో పంజాబ్‌లోని లుధియానాలో కూడా హనుమాన్‌ డ్రోన్లు ఎగురవేశారు. 


ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఎగురవేసిన డ్రోన్‌ మాత్రం ప్రత్యేకంగా ఉంది. సంజీవని కోసం వెళ్తున్న హనుమంతుడి రూపంలో... భక్తులను ఆకట్టుకుంది. ఆ డ్రోన్‌ ఆకాశంలో ఎగురుతున్నంత సేపు... హనుమంతుడే తిరుగుతున్నట్టు ఫీలయ్యారు అక్కడి భక్తులు. బజరంగబలి తమ చెంతకు వచ్చినంత సంతోషం వ్యక్తం చేశారు. సంజీవని కోసం వెళ్తున్న హనుమంతుడు కింద భక్తులను చూసి ఆశీర్వదిస్తున్నట్టు ప్రతిమను రూపొందించారు. దానికి డ్రోన్‌ కట్టి ఎగురవేశారు నిర్వాహకులు. ఈ డ్రోన్‌ ఆక్కడున్న వారందరినీ మైమరిపించింది. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడిని చూస్తూ మంత్రముగ్ధులయ్యారు స్థానికులు, భక్తులు.


డ్రోన్.. ఇప్పుడు ఇది మామూలే. ఎక్కడ చూసినా డ్రోన్‌ వినియోగాలు పెరిగిపోయాయి. ఏ ఈవెంట్‌ జరిగినా... డ్రోన్‌ విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రాజకీయ పార్టీల ప్రోగ్రామ్స్‌ అయినా, పెళ్లిళ్లు... ఫంక్షన్లు అయినా... ఏదైనా డ్రోన్లను వాడేస్తున్నారు. అయితే... అంబికాపురంలో వాడిన డ్రోన్‌ మాత్రం... క్రియేటివిటీకి అద్దం పట్టింది. దేవుడే భక్తుల చెంతకు వచ్చినట్టుగా... డ్రోన్‌ను రూపొందించారు. హనుమంతుడి డ్రోన్‌... అంబికాపూర్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లో హైలెట్‌గా నిలిచింది.