CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు రద్దయ్యాయి.


ఏమైంది?


జ్వరం కారణంగా సీఎం స్టాలిన్ కాస్త అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు.


ఈ కారణంగా ముందుగా ప్రకటించిన వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలలో సీఎం పర్యటన వాయిదా పడింది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.


ఏడాది పూర్తి


తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాది పాలనలో సీఎంగా స్టాలిన్ తనదైన మార్క్ చూపించారు. పలు రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. అమ్మా క్యాంటిన్ల కొనసాగింపు సహా పలు కీలక విషయాల్లో స్టాలిన్ అనుసరించిన తీరు అన్నాడీఎంకే నేతలు కూడా ప్రశంసించేలా చేసింది.


ఇటీవల సిటీ బస్సులో ప్రయాణించి సీఎం అందరికీ షాక్ ఇచ్చారు. మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు స్టాలిన్ పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణన్‌ రోడ్డులో వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి కారులో నుంచి కిందకు దిగి ఆ చోట నిలిచి వున్న 29సీ సిటీ బస్సులో కాసేపు ప్రయాణం చేసి వస్తానని మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


ఆ తర్వాత స్టాలిన్‌ సిటీ బస్సెక్కారు. స్టాలిన్‌ను చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు 'సీఎం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తోన్న మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు, విద్యార్థినులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.


గుర్తుకొస్తున్నాయి


తన బస్సు ప్రయాణం గురించి స్టాలిన్‌ శాసనసభలో ప్రస్తావిస్తూ 29సీ సిటీ బస్సును తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేనన్నారు.



29సీ సిటీ బస్సును ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బస్సులోనే నేను రోజూ గోపాలపురం నుంచి  పాఠశాలకు వెళ్లేవాడిని. స్టెల్లా మేరీస్‌ కాలేజీ బస్టాపులో ఆ బస్సెక్కి స్టెర్లింగ్‌ రోడ్డు దాకా వెళ్ళి అక్కడి దిగి నడచుకుంటూ చెట్‌పట్‌లోని పాఠశాలకు వెళ్లేవాడిని. తెలిపారు. శనివారం ఉదయం ఆ బస్సులో నేను ప్రయాణించినప్పుడు మహిళలు తమకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల నెలకు సగటున రూ.600 నుంచి రూ.850 వరకూ ఆదా అవుతోందని చెప్పారు.                                                              "
-  ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం



Also Read: Agnipath Recruitment Notification 2022: అగ్నిపథ్‌ నియామకాల్లో కేంద్రం దూకుడు- కీలక నోటిఫికేషన్ విడుదల


Also Read: US Mass Shooting: అమెరికా ఇక మారదా? ఈసారి వైట్ హౌస్ సమీపంలోనే కాల్పులు!