Tamil Nadu Assembly election campaign ends: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది.   ఏప్రిల్ 23న  గురువారం  మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.  

రణరంగాన్ని తలపించిన ప్రచారం 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో మైకులు మూగబోయాయి. చివరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్‌ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కోలత్తూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముగించగా, విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఎడప్పాడిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు చివరి రెండు రోజులు తెలుగు వారు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేశారు.  ఈ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు.

త్రిముఖ పోరులో  విజయ్ ఫ్యాక్టర్ 

ఈసారి ఎన్నికలు కేవలం డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యే కాకుండా త్రిముఖ పోరును తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలిసారి బరిలోకి దిగడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. విజయ్ స్వయంగా పెరంబూరు నుంచి పోటీ చేస్తుండటంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన ప్రచారానికి యువత, మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్.. అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొడతారనే చర్చ నడుస్తోంది.

కూటముల మధ్య మాటల యుద్ధం 

అధికార  డీఎంకే  కూటమి తమ  ద్రవిడ మోడల్  పాలన, సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రచారం నిర్వహించింది. మరోవైపు, బీజేపీతో మళ్లీ జతకట్టిన  ఏఐఏడీఎంకే  ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని అస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు తమిళనాడులో పర్యటించి ఎన్డీయే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించగా, రాహుల్ గాంధీ కూడా డీఎంకే కూటమికి మద్దతుగా సభల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  

 స్థానిక సమస్యలే ఎజెండా 

ఈ ఎన్నికల్లో నీట్ రద్దు, కావేరీ జలాల వివాదం, కచ్చతీవు ద్వీపం అంశాలతో పాటు నిత్యావసర ధరల పెరుగుదల వంటి స్థానిక సమస్యలు ప్రధాన ఎజెండాగా నిలిచాయి. డీఎంకే ప్రభుత్వం తన హయాంలో అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం వంటి పథకాలు తమను గట్టెక్కిస్తాయని భావిస్తుండగా.. అవినీతి, శాంతిభద్రతల సమస్యలను ఎత్తిచూపుతూ విపక్షాలు ప్రజల్లోకి వెళ్లాయి. విజయ్ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారత, అవినీతి రహిత పాలనకు పెద్దపీట వేశారు.  పోలింగ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో సరిహద్దులను సీజ్ చేసి, భారీగా భద్రతా బలగాలను మోహరించారు. గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు నిశితంగా నిఘా ఉంచారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.