Apple to face Rs 3800 crore fine: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు  కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి సెగ తగులుతోంది. యాప్ స్టోర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అడిగిన ఆర్థిక వివరాలను సమర్పించకపోవడంతో, యాపిల్‌పై సుమారు రూ. 3,800 కోట్ల భారీ పెనాల్టీ పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, యాప్ డెవలపర్లను తన సొంత పేమెంట్ వ్యవస్థనే వాడాలని ఒత్తిడి చేస్తోందన్న ఆరోపణలపై గత కొంతకాలంగా విచారణ సాగుతోంది. తాజాగా ఈ విచారణ తుది దశకు చేరుకోవడంతో యాపిల్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.                            భారత మార్కెట్లో తమది చాలా చిన్న పాత్ర అని, తాము ప్రధాన ప్లేయర్లం కాదని యాపిల్ వాదిస్తోంది. అయితే యాపిల్ వాదనను సిసిఐ కొట్టివేస్తోంది. గణాంకాల ప్రకారం.. రెండేళ్ల క్రితం భారత్‌లో 4 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ప్రస్తుతం 9 శాతానికి పైగా పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధిని చూస్తుంటే, యాపిల్ తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని సిసిఐ 2024 నివేదికలో స్పష్టం చేసింది. తన వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, పాత వాదనలతో తప్పించుకోవడం యాపిల్‌కు ఇప్పుడు కష్టతరంగా మారింది.                 అక్టోబర్ 2024 నుండి యాపిల్ తన ఆర్థిక వివరాలను సమర్పించకుండా కాలయాపన చేస్తోందని నియంత్రణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరిమానా మొత్తాన్ని నిర్ణయించడానికి ఈ డేటా అత్యంత కీలకమని సిసిఐ స్పష్టం చేసింది. అయితే, యాపిల్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు తీసుకెళ్లింది. జరిమానాల లెక్కింపుపై ఉన్న నిబంధనలను సవాల్ చేస్తూ, విచారణను నిలిపివేయాలని కోరినప్పటికీ సిసిఐ అందుకు నిరాకరించింది. గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా జరిమానా వేస్తే అది అన్యాయమని యాపిల్ వాదిస్తోంది.                      యాపిల్ అభ్యర్థనలను తోసిపుచ్చిన సిసిఐ, వివరణ ఇవ్వడానికి మరో రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసుపై మే 21వ తేదీని తుది విచారణా దినంగా ఖరారు చేసింది. ఒకవేళ ఆ లోపు సరైన డేటా ఇవ్వకపోతే, లభించిన సమాచారం ఆధారంగానే భారీ పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసులో వెలువడే తీర్పు భవిష్యత్తులో భారత్‌లో ఇతర అంతర్జాతీయ టెక్ కంపెనీల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.                         భారత్‌ను తన తదుపరి అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుకోవాలని చూస్తున్న యాపిల్‌కు, ఈ చట్టపరమైన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఐఫోన్ల విక్రయాలు పెరుగుతున్నా, మరోవైపు నియంత్రణ సంస్థల కొరడా దెబ్బ యాపిల్ లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 21న జరగబోయే విచారణలో యాపిల్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. 

Continues below advertisement

Continues below advertisement