చెన్నై: భారత ప్రధాని నరేంద్ర మోదీ హిందీ స్పీచ్‌లను తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా సూత్రానికి ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలుపుతోందని, ప్రపంచ స్థాయిలో విజయం సాధించానికి అధిక భాషలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలపై హిందీని ఎవరూ రుద్దడం లేదన్నారు. మీకు నచ్చినా, నచ్చకపోయినా వచ్చే ఎన్నికల్లో, ఆ తరువాత ఎన్నికల్లోనూ మోదీనే భారత ప్రధాని అని కితాబిచ్చారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. త్రిభాషా సూత్రానికి తన మద్దతు ప్రకటించారు. పలు భాషలు నేర్చుకోవడంతో అంతర్జాతీయంగా అవకాశాలు ఉంటాయన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్, సాంస్కృతిక వైవిధ్యం, జీవన విధానం ఉంటాయని వాటిని గౌరవించాలని సూచించారు. గతంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య పోటీ ఉండేదని.. ఈసారి హిందీ భాష పై రాద్ధాంతం జరుగుతుందన్న విషయంపై చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ హిందీని తప్పనిసరి చేయాలని లేదా జాతీయ భాషగా రుద్దలేదని, ప్రజలు స్వచ్ఛందంగానే నేర్చుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఉన్నది ఒకటే ఇజం టూరిజం..
‘ప్రపంచం ఒక గ్లోబల్ మార్కెట్‌గా మారింది. పాత ఆలోచనలు, సంకుచిత మనస్తత్వం నుంచి బయటకు రావాలి. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉందని, భవిష్యత్ ఎన్నికలలో కూడా ఆయన అధికారంలోకి వస్తారు. మీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఆయనే విజయాలు సాధించి ప్రధానిగా కొనసాగుతారు. అభివృద్ధికి మార్పులకు అనుగుణంగా మారాలి. విశాల దృక్పథంతో ఆలోచించాలి. పెట్టుబడిదారీ విధానం, సోషలిజం, కమ్యూనిజం వంటి సాంప్రదాయ భావజాల విభజనలు క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోయాయి. ప్రస్తుతం కేవలం టూరిజం మాత్రమే ప్రాధాన్యత కలిగిన రంగమని’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
భారత్‌లో వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెసరట్టు, పొంగల్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. చెన్నైకి వచ్చినప్పుడు నేను ఇడ్లీ సాంబార్ ఇష్టంగా తింటానని తెలిపారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలే దేశానికి బలమని పేర్కొన్నారు. ఈ వైవిధ్యమే ప్రపంచ పర్యాటకానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని... అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. కానీ భాషలపై వ్యతిరేకత, ప్రాంతాలపై వ్యతిరేకత లాంటివి మానుకోవాలని చంద్రబాబు సూచించారు.
