Tamil Nadu Assembly Special Session: 


గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం


తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి (RN Ravi)మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ప్రభుత్వం పంపిన 10 బిల్స్‌ని తిరిగి పంపారు. మళ్లీ వీటినే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంచలనమైంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్స్‌ని ప్రవేశపెట్టింది. నవంబర్ 16వ తేదీన ఈ బిల్స్‌ని వెనక్కి పంపంది గవర్నర్ ఆర్‌ఎన్ రవి. ఈ బిల్స్‌కి ఆమోదం తెలపాలని ప్రభుత్వం పంపినప్పటికీ వాటిని తిరస్కరించారు గవర్నర్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ముఖ్యమంత్రి MK స్టాలిన్  (MK Stalin) ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్స్‌కి గవర్నర్ ఆమోదం తెలపకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఈ బిల్స్‌ని పాస్ చేశామని, గవర్నర్‌కి మళ్లీ పంపుతామని అసెంబ్లీ స్పీకర్ అప్పవు వెల్లడించారు. వాయిస్ ఓట్ ద్వారా ఈ బిల్స్‌ని మళ్లీ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే...ఈ ఓటింగ్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అటు AIDMK ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఈ బిల్స్‌ పాస్‌ని చేసే విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది తమిళనాడు ప్రభుత్వం. బిల్స్ పాస్ అయ్యేందుకు ఓ డెడ్‌లైన్‌ పెట్టాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది. గవర్నర్ కావాలనే బిల్స్‌కి ఆమోదం తెలపడం లేదని అసహనం వ్యక్తం చేసింది. మొత్తం 12 బిల్స్‌తో పాటు 4 కీలక ఉత్తర్వులూ ఉన్నాయి. వీటిలో 54 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులూ ఉన్నాయి. నవంబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం జోక్యం చేసుకుని ఈ వివాదం సద్దుమణిగేలా చూడాలని తేల్చి చెప్పింది. 


తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ గవర్నర్ RN రవిపై (RN Ravi) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గవర్నర్‌ని మార్చొద్దని తేల్చి చెప్పారు. చెన్నైలో ఓ పెళ్లికి హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షాపైనా విమర్శలు గుప్పించారు ఎమ్‌కే స్టాలిన్. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గవర్నర్‌ని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు. DMK ఎన్నికల ప్రచారానికి గవర్నర్‌ చాలా సహకరిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఆయన వల్ల తమ పార్టీకి ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. 


"ద్రవిడం అంటే ఏంటని పదేపదే గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రశ్నిస్తున్నారు. ఆయనను అలా ప్రశ్నించనివ్వండి. అదే మా ఎన్నికల ప్రచారానికి బలం. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆయనను మార్చాల్సిన పని లేదు. ప్రధాని మోదీ, అమిత్‌షాకి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి మా రాష్ట్ర గవర్నర్‌ని మార్చకండి. ఆయన నోటికొచ్చిందేదో మాట్లాడుతున్నారు. ప్రజలు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. బంగ్లాల్లో హాయిగా కూర్చునే వాళ్లు ఉన్నత పదవుల్లో ఉంటున్నారు. అవి ఎందుకూ పనికి రాని పదవులు. వాళ్లు ద్రవిడం గురించి మాట్లాడుతున్నారు"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


Also Read: Gaza News: నెతన్యాహుని కాల్చి పారేయాలి, కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు