Aavin vs Amul: భారత దేశంలో ఆనాడు శ్వేతవిప్లవానికి నాంది పలికి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది అమూల్. దేశవ్యాప్తంగా ఉన్న పాలు, పాల ఉత్పత్తుల బ్రాండ్లలో అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతోంది ఈ దిగ్గజ సంస్థ. ఒకప్పుడు శ్వేతవిప్లవానికి నాంది పలికిన అమూల్ ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అమూల్ డైరీపై ఎంత పెద్ద వివాదం చెలరేగిందో తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వ బ్రాండ్ అయిన నందినికి పోటీగా అమూల్ ను తీసుకురావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. సాధారణ ప్రజల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు వెనక్కి తగ్గక తప్పలేదు. బీజేపీ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా మారిపోయింది. కర్ణాటక సెంటిమెంట్ ముందు రాజకీయాలు తేలిపోవడంతో ఇప్పుడు పొరుగున్న ఉన్న తమిళనాడుకు పాల పంచాయితీ షిఫ్ట్ అయింది.


'అనారోగ్యకరమైన పోటీని నివారించండి'


తమిళనాడు పాల సహకార సంఘం ఆవిన్ మిల్క్ షెడ్ ఏరియా నుంచి అమూల్ పాలను సేకరించకుండా చూడాలని తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆవిన్ పరిధిలోని పాలను అమూల్ సేకరిస్తే అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు మిల్క్ షెడ్ ప్రాంతంలో కైరా జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్(అమూల్) ద్వారా పాల సేకరణ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. 


'క్రాస్ ప్రొక్యూర్‌మెంట్‌ శ్వేతవిప్లవ స్ఫూర్తికి విరుద్ధం'


కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి అమూల్ తన బహుళ-రాష్ట్ర సహకార లైసెన్స్ ను ఉపయోగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు స్టాలిన్ తెలిపారు. కృష్ణగిరి, ధర్మపూరి, రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీల ద్వారా పాలను సేకరించాలని అమూల్ యోచిస్తోందని, దానిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలిపారు. ఇటువంటి క్రాస్ ప్రొక్యూర్మెంట్ శ్వేతవిప్లవ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం పాల కొరత దృష్ట్యా వినియోగదారులకు ఇది మరింత సమస్యగా మారుతుందన్నారు. అమూల్ యొక్క ఈ చర్య దశాబ్దాలుగా నిజమైన సహకార స్ఫూర్తితో పెంపొందించబడిన ఆవిన్(తమిళనాడు కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్) మిల్క్ షెడ్ ప్రాంతాన్ని ఉల్లంఘించింది.


Also Read: Amul Milk Prices Hike: మరోసారి అమూల్ పాల ధర పెంపు, ఈసారి ఎంతంటే?


అమూల్ చర్య పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ లో నిమగ్నమైన సహకార సంఘాల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తుందని స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ సహకార సంఘాలు రాష్ట్రాల్లో పాడిపరిశ్రమ అభివృద్ధికి పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఇవాళ స్టాలిన్ దానికి సంబంధించిన ఓ పోస్టు చేశారు.