AISMK Merged In Bjp: పార్లమెంట్ ఎన్నికలలు సమీపిస్తున్న రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. కొన్ని పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్నాయి. చిన్నా చితకా పార్టీలు బీజేపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు బీజేపీలోకి విలీనం అవుతున్నాయి. తమిళనాడు(Tamilnadu)లో పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కలిసి పోటీ చేసినా... దారుణమైన ఫలితాలను చవి చూసింది. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పార్టీని బీజేపీలో విలీనం చేసిన శరత్ కుమార్
ఇప్పటికే దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ కుమార్ (Actor Sarath Kumar) తన పార్టీని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో...పార్టీని బీజేపీలో కలిపేశారు శరత్ కుమార్. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని శరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా అందిస్తున్నారని మోదీపై ప్రశంసలు కురిపించారు.
డీఎంకే వయా అన్నాడీఎంకే...
1996లో రాజకీయాల్లో వచ్చారు శరత్ కుమార్. 1996లో డీఎంకేలో చేరిన ఆయన...2001లో రాజ్యసభ సభ్యుడిగా నియమించారు కరుణానిధి. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ రాంరాం చెప్పేశారు. సతీమణి రాధికతో కలిసి అన్నాడీఎంకేలో చేరినప్పటికీ.... ఎక్కువ రోజులు ఆ పార్టీలో కొనసాగలేకపోయారు.
2007లో సొంత పార్టీ స్థాపించి శరత్ కుమార్
2007 ఆగస్టులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా....ఆశించిన ఫలితాలను రాబట్టడంలో శరత్ కుమార్ విఫలమయ్యారు. తాజాగా తన పార్టీని భారతీయ జనతా పార్టీని విలీనం చేశారు. ఆ పార్టీ విజయం కోసం పని చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. పార్టీని బిజేపీలో విలీనం చేసిన శరత్ కుమార్...పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదంటే పార్టీ కోసం మాత్రమే పని చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తమిళ ప్రజలు బీజేపీని, ఆ పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తుంటే...శరత్ కుమార్ తన పార్టీ విలీనం చేయడాన్ని తప్పుపడుతున్నారు.