SBI Shared Electoral Bonds Data to Election Commission India: దేశంలోని పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన వివరాలు అన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి అందించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి నేడు (మార్చి 12) సాయంత్రం 5.30 గంటలకు అందించినట్లుగా జాతీయ వార్తా పత్రికలు రాశాయి.
సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 11) ఇచ్చిన తీర్పు ప్రకారం.. అన్ని పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వస్తున్న విరాళాలకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి ఎస్‌బీఐ మార్చి 12 సాయంత్రంలోగా అందించాలి. తాము ఇచ్చిన గడువులోగా ఈ వివరాలు అందించడంలో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న హెచ్చరించింది. దీన్ని ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించడానికి తమకు సమయం కావాలని, ఆ గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్‌బీఐ పిటిషన్ వేయగా.. ధర్మాసనం బ్యాంకు వినతిని తోసిపుచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి 12 నాటికి బిజినెస్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
రాజకీయ పార్టీలకు ఆదాయం వచ్చే మార్గాల్లో ఒకటైన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఇదే ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో భాగంగా.. ఎవరు ఎంత విరాళాన్ని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీకి ఇచ్చారనే వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే వెసులుబాటు కేవలం ఎస్బీఐకు మాత్రమే కల్పించారు.
ఇలా పొలిటికల్ పార్టీలు గోప్యంగా ఫండింగ్ పొందే విధానాన్ని సుప్రీంకోర్టు.. రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. దాతల వివరాలను కచ్చితంగా ఎస్‌బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశంలోని ప్రతిపక్ష నాయకులు ప్రశంసించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇచ్చారో త్వరలో దేశానికి తెలుస్తుందని వారు అన్నారు.